సీతారామశాస్త్రి మరణంపై ఆర్ ఎస్ ఎస్ సంతాపం

భారతీయ తాత్వికతకు ఊపిరిగా మూడున్నర దశాబ్దాల పాటు సాగిన సాహిత్య ఝరి పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో 30 నవంబర్ 2021, మంగళవారం సాయంత్రం శివైక్యం పొందారు.

`గంగావతరణం’ రూపకం ద్వారా ప్రతిభ చాటిన చేంబోలు సీతారామశాస్త్రి, 1986లో `సిరివెన్నెల` సినిమా కోసం రాసిన పాటల ద్వారా `సిరివెన్నెల సీతారామశాస్త్రి` గా ప్రజల మనస్సులలో స్థానం పొందారు.

సిరివెన్నెల ఒక వినూత్న సాహితీ మూర్తి, “చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని..’’ వంటి ఎన్నో గీతాల ద్వారా  ప్రతి అక్షరానికి ప్రాణం పోసి, తన  చైతన్య ప్రణవ నాదం తో రచయితగా, కవిగా, గాయకుడుగా సినీ, సాహితీ రంగాల్లో చెరగని ముద్ర వేశారు. మూడు వేలకు పైగా పాటలు రాసిన, సీతారామశాస్త్రి గారు సినీ సాహిత్యానికి చేసిన సేవలకుగానూ `2019 లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది మరియు దాదాపు 11 నంది అవార్డులు అందుకున్నారు.

2013 వ సంవత్సరం భాగ్యనగర్ నిజాం కళాశాల ప్రాంగణంలో జరిగిన ‘ఘోష్ తరంగ్’ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సీతారామశాస్త్రి గారు చిరస్మరణీయులు, వారి మరణం సాహిత్య రంగంలో తీరని లోటు. ఆయన ఆత్మకు  శాంతి, సద్గతులు కలగాలని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నాను.

సీతారామశాస్త్రి గారి కుటుంబ సభ్యులందరికి ఆత్మస్తైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఈశ్వరుని కృప, ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుచున్నాను.

బూర్ల దక్షిణామూర్తి
ప్రాంత సంఘచాలక్,
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, తెలంగాణ.