
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల కూటమి యుపిఎకు కాలం చెల్లిందా? కాంగ్రెస్ విధానాలతో విసుగు చెందిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలతో మరో కూటమి ఏర్పాటుకు సిద్దపడుతున్నారా? టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వాఖ్యలు గమనిస్తే అవుననే స్పష్టం అవుతుంది.
పైగా, యూపీఏలో కీలక భాగస్వామి అయినా ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ను ముంబైలో కలసి, ఆయన ఇంటి వద్దనే, ఆయన సమక్షంలోనే ఆమె ‘యూపీఏ ఏంటి..? అదెక్కడుంది..? ఇక్కడైతే అలాంటిదేమీ లేదు’’.. అంటూ పరోక్షంగా కాంగ్రెస్ ఉనికిని ఆమె కొట్టిపారవేసిన్నట్లు మాట్లాడారు.
కొద్ది రోజుల క్రితం ఎన్‌డీయేకు ప్రత్యామ్నాయం యూపీఏనే.. కాంగ్రెస్ సారథ్యం లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని సృష్టించలేమని గట్టిగా చెప్పిన వారిలో శరద్ పవార్ ప్రముఖులు కావడం గమనార్హం. మమతా బెనర్జీని బుధవారం ముంబైలోని తన నివాసంలో శరద్ పవార్ కలుసుకున్నారు.
‘‘ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి, ప్రజాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేయడానికి సమిష్టి ప్రయత్నాలను చర్చించాము. అంతే కాకుండా మిత్రపక్ష పార్టీల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఒక అవగాహనకు వచ్చాం’’ ట్వీట్ పవార్ చేశారు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీని పవార్ కూడా పక్కన పడేశారా అనే అనుమానాలు వస్తున్నాయి.
శరద్ పవార్ సీనియర్ నేతని, ఆయనతో రాజకీయ అంశాలు చర్చించానని..పవార్ అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవించానని దీదీ చెప్పుకొచ్చారు. బీజేపీని మట్టికరిపించేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చిన క్రమంలో శరద్ పవార్‌తో ఆమె భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
“కాంగ్రెస్ లేకుండా బలమైన ప్రత్యామ్న్యాయం సాధ్యమా?” అని మీడియా ప్రశ్నించగా, పోరాడేవారితోనే ప్రత్యామ్న్యామ ఏర్పర్చగలమని ఆమె స్పష్టం చేశారు. అంటే కాంగ్రెస్ లో పోరాట స్ఫూర్తి కనిపించడం లేదని ఆమె పరోక్షంగా స్పష్టం చేసిన్నట్లయింది. “పోరాటం చేయని వారితో కలసి ఏమి చేస్తాం?” ఆమె ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు.
అంతకు ముందు కొందరు పౌరసమాజ ప్రముఖులతో ఆమె సమావేశం అవుతూ ప్రతిపక్షాలకు మార్గనిర్ధేశం చేయడం కోసం పౌరసమాజంలో ప్రముఖులతో ఒక సలహా మండలి ఏర్పాటు చేయమని కాంగ్రెస్ పార్టీకి సహించానని, కానీ ఆ పార్టీ పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు.
పలు రాష్ట్రాలలో తమ పార్టీ పోటీకి సిద్దపడటం కాంగ్రెస్ ను బలహీనం చేసి, బిజెపిని బలోపేతం చేయడానికే అని కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మమతా కొట్టిపారేసారు. కాంగ్రెస్ పార్టీ బెంగాల్‌లో పోటీ చేస్తుండగా తాము గోవాలో ఎందుకు పోటీ చేయకూడదని దీదీ ప్రశ్నించారు.
ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే బీజేపీని సులువుగా ఓడించవచ్చని మమతాబెనర్జి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపుతున్నది. దేశ రాజకీయాల వాస్తవ స్థితిగతులేమిటో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండానే కేంద్రంలో బీజేపీని ఓడించగలమని ఎవరైనా అనుకుంటే అది ఒట్టి కలగానే మిగిలిపోతుందని అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ శాపనార్ధాలు పెట్టారు. కేంద్రంలో బీజేపీని ఓడించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ కాకుండా మూడో ప్రత్యామ్నాయం దిశగా మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్న మమతా ఇప్పటికే పలురాష్ట్రాలలో కాంగ్రెస్ లో అసంతృప్తి నేతలను అక్కున చేర్చుకొని, వారికి కీలక పదవులు ఇస్తున్నారు. ఇద్దరినీ రాజ్యసభకు కూడా పంపారు. అస్సాం, త్రిపుర, మేఘాలయ, గోవా, ఉత్తర ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలలో టిఎంసి ఉనికి చాటేవిధంగా ఆమె ఎత్తుగడలు వేస్తున్నారు.
More Stories
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
12-13 తేదీల్లో మోదీ అమెరికా పర్యటన