పంజాబ్ లో బిజెపి కూటమి వైపు మొగ్గు

మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో ప్రజలు బిజెపి, తాను ప్రారంభించబోయే పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రస్తుతం పూర్తిగా మొగ్గు చూపుతున్నారని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ భరోసా వ్యక్తం చేశారు.
“ఈ రోజు నాటికి, నా స్వంత అభిప్రాయం ఏమిటంటే, బిజెపి వైపు మొత్తం మొగ్గు ఉంది. చాలా మంది హిందువులు బీజేపీకి, నా పార్టీకి మద్దతిస్తున్నారు. పంజాబ్‌లో 36 శాతం మంది హిందువులు ఉన్నారు. మేము కాంగ్రెస్ కంటే ఎక్కువగా వారి ఓట్లను పొందగలము. మేము రైతుల నుండి కూడా చాలా మద్దతు పొందుతామని ఆశిస్తున్నాము” అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రతిరోజూ తన పార్టీలో చేరేందుకు “ముగ్గురు నుండి నలుగురు నాయకులు” వస్తున్నారని అమరీందర్ ప్రకటించారు. “మాకు ఇప్పటికే 30-40 మంది దరఖాస్తుదారులు ఉన్నారు. మాతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యను నేను ఇప్పుడే బహిరంగపరచచలేను” అని ఆయన వెల్లడించారు.

సోమవారం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో అమరీందర్ భేటీ అయ్యారు. సమావేశం అనంతరం, అమరీందర్ విలేకరులతో మాట్లాడుతూ, తమ పార్టీ బీజేపీతోనూ, శిరోమణి అకాలీదళ్-సంయుక్త్ వర్గమైన సుక్‌దేవ్ సింగ్ ధిండాతోనూ “సీట్ల సర్దుబాటు” చేసుకుంటుందని చెప్పారు.

తాను ప్రారంభిస్తున్న పంజాబ్ లోక్ కాంగ్రెస్,  బిజెపి మధ్య  ఎన్నికల పొత్తును త్వరలో ప్రకటించవచ్చని అమరీందర్ సింగ్ సంకేతం ఇచ్చారు. అమరీందర్ సెప్టెంబరులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పొత్తుపై ఇప్పటికే చర్చించినట్లు అమరీందర్ వెల్లడించారు. 

 
బహుశా, శనివారం తాను బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను కలసి ఈ విషయమై వివరంగా చర్చించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే వ్యవసాయ చట్టాలపై చెలరేలంగిన వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించుకొంటే తాను బిజెపితో ఎన్నికల పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. 
 
మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 19న ప్రధాని మోదీ ప్రకటించిన వెంటనే, ఈ చర్యను స్వాగతించిన తొలి బీజేపీయేతర నాయకులలో అమరీందర్ కూడా ఉన్నారు. అప్పుడే బిజెపితో పొత్తుకు మార్గం సుగమం అయిన్నట్లు చెప్పారు.