రియాల్టీ గేమ్ షో బిగ్‌బాస్ నిషేధించండి

రియాల్టీ గేమ్ షో బిగ్‌బాస్ షోను నిషేధించాలని బిజెపి శాసనసభా పార్టీ నాయకుడు రాజాసింగ్ డిమాండ్ చేశారు. బిగ్ బాస్‌పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. బిగ్ బాస్ షోను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు పెరిగిపోతున్నారు. ఈ షోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ నేత నారాయణ బిగ్ బాస్ గేమ్ షోను ఇదివరకే తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా ఎంఎల్‌ఎ రాజాసింగ్ బిగ్ బాస్‌పై స్పందించారు. 

అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. రవి విషయంలో ఏం జరిగిందో, అది బయటకు రావాలని స్పష్టం  చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఆంధ్రా, తెలంగాణ అందు ఉద్రిక్తలను  తెచ్చి రెచ్చగొడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

అసలు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి ప్రజలకు ఏం సందేశాలు ఇస్తున్నారంటూ ఆయన  ప్రశ్నించారు. చిన్న పిల్లలు, మహిళలు బిగ్ బాస్ కంటెంట్ చూడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షోకి సైతం సెన్సార్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. హిందూ దేవుళ్లను సైతం బిగ్ బాస్‌లో కించపరుస్తున్నారని రాజాసింగ్  ఆరోపించారు. బిగ్ బాస్ షోను అన్ని భాషల్లోనూ నిషేధించాలని కోరుతూ  కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు.

 కాగా, ఆదివారం రాత్రి  ప్రముఖ యాంకర్  రవి ఎలిమినేట్ అయిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఒక్కసారిగా అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, బిగ్‌బాస్‌లో తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని రవి అభిమానులు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఎవ్వరెవ్వరికి ఎన్నెన్ని ఓట్లు వేసారో బైటపెట్టమని సవాల్ చేశారు. 

రవి సహితం ఒక విధంగా తనను ఎలిమినేటి చేయడం పట్ల భావావేశానికి  గురయిన్నట్లు కనిపిస్తున్నది. తాను ఇలా బైటకు వస్తానని ఊహించని లేదని స్పష్టం చేశారు. తనకన్నా ప్రజాదరణ చాలా తక్కువగా ఉన్న వారిని మాత్రం లోపలే ఉంచడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. బైటకు వస్తూ “నేను వెడితే గాని నీవు చివరకు విజయం సాధింపలేవు” అంటూ లోపలున్న ఒకరిని ఉద్దేశించి పేర్కొనడం గమనార్హం. 

తాము కోరుకున్న వారిని విజేతగా ప్రకటించడం  రవిని అర్ధాంతరంగా బైటకు పంపారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాను బిగ్ బాస్ లో విజేత కాలేకపోయినా, బైటకు వచ్చిన తర్వాత తన పట్ల చూపిస్తున్న అభిమానం చూస్తుంటే తాను `అసలైన విజేత’ అని భావిస్తున్నట్లు రవి సంతృప్తి వ్యక్తం చేశారు.