తెలంగాణ వలస కార్మికుల కోసం రూ.330 కోట్ల కేంద్ర నిధులు

కరోనా వేళ ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కింద తెలంగాణలోని 1.84 లక్షల మంది వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ రూ.102.66 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1.73 లక్షల వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తూ రూ.102.69 కోట్లు కేంద్రం ఇచ్చిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి స్పష్టం చేవారు. 

దీనికి అదనంగా భవన నిర్మాణఫ కార్మికులు సంక్షేమ బోర్డు రూ.124.55 కోట్లు విడుదల చేసిందని, దీనివల్ల 8.30 లక్షల భవన నిర్మాణ కార్మికులు లబ్ది పొందారని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలంగాణలోని వసల కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం ఖర్చు చేసిన నిధడులపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

వలస కార్మికుల కోసం మోదీ  ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, కరోనా విపత్తు కాలంలో అదనంగా మరిన్ని చర్యలు చేపట్టిందని ఈ సమాధానంలో మంత్రి తెలిపారు. కరోనా వేళ ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కింద దేశవ్యాప్తంగా 39.51 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని పేర్కొన్నారు. తత్ఫలితంగా ఈపీఎఫ్ ఖాతాల్లో అదనంగా రూ.2583 కోట్లు జమయ్యాయని తెలిపారు. 

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 38.91 లక్షల మంది చిరు ఉద్యోగులకు రూ.2567 కోట్లు ప్రయోజనం చేకూర్చామని చెప్పారు. భవన నిర్మాణ, ఇతర కార్మికుల కోసం రూ.7413 కోట్ల సాయం అందించామని మంత్రి తెలిపారు. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కింద 50.78 కోట్ల మానవ పనిదినాలు సృష్టించామని, అందుకోసం  రూ.39,293 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. 

పిఎం స్వనిధి కింద రుణాలు, ప్రతి వ్యక్తికి అదనంగా నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందించామని చెప్పారు. ఇందులో భాంగా తెలంగాణలోని వలస కార్మికుల కోసం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన కింద రూ.102.66 కోట్లు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రూ.102.69 కోట్లు, భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ద్వారా రూ.124.55 కోట్లు కలిపి మొత్తం రూ.329.90 కోట్లు కేంద్రం వెచ్చించిందని మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు.