టీఆర్ఎస్ పార్టీ బండారం రోజుకొకటి బయటపెడ్తా

“తెలంగాణ కోసం.. టీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నన్నే కోవర్ట్ అంటారా..? టీఆర్ఎస్ పార్టీ బండారం రోజుకొకటి బెయటపెడ్తా” అని ఆ పార్టీ నుండి రాజీనామా చేసిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ హెచ్చరించారు. స్థానిక సంస్థలనుండి ఎమ్యెల్సీ ఎన్నికల్లో తాను దాఖలు చేసిన  నామినేషన్ తిరస్కరించే కుట్ర చేశారని ధ్వజమెత్తారు. 

తనను ప్రపోజ్ చేసిన వాళ్లను బెదిరించి పోర్జరీ చేశారని కేసు పెట్టించాలని చూశారని ఆయన ఆరోపించారు. తనకు మద్దతిచ్చిన వారిని భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తే.. వాళ్లు భయపడకుండా ఆ సంతకాలు మావేనని కలెక్టర్ ముందు చెప్పారని, అయినా ఎన్నికల అధికారి మూడు గంటలపాటు ఇబ్బంది పెట్టి చివరికి తన నామినేషన్ ఆమోదించారని ఆయన వెల్లడించారు. 

అర్జునగుట్టలోని ఆలయంలో తనకు ఎమ్మెల్సీ ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, మేయర్ పదవి పోయాక కూడా తన జన్మదినం రోజున తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మంత్రుల ముందు, నేతల ముందు చెప్పారని ఆయన తెలిపారు. కరీంనగర్ కు చెందిన మంత్రి తనను అవమానాలకు గురి చేశారుని ఆయన ఆరోపించారు. 

టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన భాను ప్రసాద్ రావు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పని చేశారు? అని ఆయన ప్రశ్నించారు. 12 ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాద్ రావు 12 రోజులైనా కరీంనగర్ లో ఉన్నారా..? ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలు గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అని నిలదీశారు. 

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ల వ్యాపారాలు చూసుకుంటారు తప్ప స్థానిక సంస్థల ప్రయోజనాలు పట్టించుకోరని మాజీ మేయర్ ధ్వజమెత్తారు. రాజీవ్ రహదారి నిర్మాణ లోపాలపై వేసిన శాసన మండలి కమిటీ చైర్మన్ గా భాను ప్రసాదరావు అవినీతికి పాల్పడ్డారని, రాజీవ్ రహదారిలో ఎన్ని మలుపులు ఉన్నాయి అన్ని కోట్లు భాను ప్రసాదరావు తీసుకున్నాడని ఆరోపించారు. 

అదే తనను గెలిపిస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోసం కరీంనగర్ లో ఆఫీస్ ప్రారంభిస్తానని, నిరుపేద స్థానిక ప్రజాప్రతినిధుల కోసం హెల్త్ కార్డులు సాధిస్తానని తెలిపారు. 
ఉద్యమాన్ని దూషించిన వాళ్లను, ఉద్యమకారులపై రాళ్లు వేసిన వాళ్లను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

మానుకోటలో రాళ్లువిసిరిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చారని పేర్కొంటూ 24 గంటల్లోపే ఆయనకు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులు లేరా? వెంకటరామిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారు? ఉద్యమకారులకు పాలనలో అవకాశం ఇస్తే ప్రజల కష్టాలు తీరేలా పని చేస్తారని ఆయన పేర్కొన్నారు. 

ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది.. కాబట్టే నేను ఎంతో బాధతో సీఎంకు లేఖ రాశానని చెప్పారు. భాను ప్రసాదరావు 4 సెట్ల నామినేషన్ వేశారని, ఈ నాలుగు సెట్లకు ప్రపోజల్ సంతకాలు చేసిన 40 మంది పేర్లు ఆయన చెప్పగలిగితే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. 

హుజూరాబాద్ లో ఓటుకు పది వేలు ఇచ్చినా ఈటల రాజేందర్ గెలవడం చూశామని, అదే రీతిలో జిల్లా ప్రజలు మరోసారి చైతన్యం చూపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పోతోందని, మరోసారి తన విజయంతో అది రుజువు అవుతుందని భరోసా వ్యక్తం చేశారు. తాను అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థినని చెబుతూ తనకు చాలామంది మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.