కరోనా ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ హితవు చెప్పారు. ఇది డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం అనిహెచ్చరించారు. దక్షిణాఫ్రికాతోపాటు పలు దేశాల్లో ఈ వేరియంట్ విరుచుకు పడుతున్నది. అనునిత్యం నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ఖేత్రపాల్ సింగ్ చెప్పారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంతో విశ్వమారి వ్యాపించకుండా అవసరమైన చర్యలు చేపనిట్టాలని ఆమె పేర్కొన్నారు. కరోనా మార్గదర్శకాలకు లోబడే పండుగలు,ఇతర వేడుకలు జరుపుకోవాలని, భౌతిక దూరం పాటించడంతోపాటు జన సమూహాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.
ఎటువంటి పరిస్థితుల్లోనూ కరోనా మార్గదర్శకాలను పాటించే విషయంలో అలసత్వం పనికి రాదని ఆమె స్పష్టం చేశారు. ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా కేసులు తగ్గుతున్నా.. పలు దేశాల్లో మహమ్మారి విజృంభించడం, పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్లు ముప్పును గుర్తు చేస్తున్నాయని ఖేత్రపాల్‌సింగ్ చెప్పారు.
ఈవేరియంట్ నుంచి రక్షణ కోసం, దాని వ్యాప్తి నివారణకు నిఘా పెంచాలని ఆమె సూచించారు. అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా, కొత్త వేరియంట్ల వ్యాప్తిపై వస్తున్న వార్తల సమాచారంతో తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముక్కూ నోటిని కప్పివేసేలా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకుంటూ.. వెలుతురు లేని గదులకు దూరంగా ఉండాలని ఖేత్రపాల్ సింగ్ వివరించారు. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు.
ఇప్పటి వరకు ఆగ్నేయాసియా ప్రాంత జనాభాలో 31 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోగా, 21 శాతం మందికి పాక్షికంగా టీకా అందిందని పేర్కొన్నారు. మరో 48 శాతం ఇంకా టీకాలు వేయించుకోలేదని తెలిపారు. అటువంటి వారికి వైరస్ ముప్పు పొంచి ఉందని ఆమె హెచ్చరించారు.
డబ్ల్యూటీవో సదస్సు వాయిదా
ఇలా ఉండగా, తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో వచ్చే వారం జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) మినిస్టీరియల్(ఎంసీ12) కాన్ఫరెన్స్ లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డబ్ల్యూటీవో ప్రకటించింది. నవంబర్ 30 – డిసెంబర్ 3 మధ్య జెనీవాలో ఇది జరగాల్సి ఉంది.
రెండేళ్లకొకసారి జరిగే ఎంసీ12 భేటీలో మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా రద్దు చేయడం ఇది రెండోసారి. గత సంవత్సరం జూన్ లో జరగాల్సిన సమావేశం కరోనా వల్ల మొదటి సారి రద్దు అయింది.
మరోవంక, కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతోపాటు కొత్తవైరస్ ఒమిక్రాన్ ప్రబలే ప్రమాదం ఉండటంతో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ విధిస్తు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఉత్తర్వులు జారీ చేశారు. న్యూయార్క్‌లో ఇప్పటివరకు ఓమిక్రాన్‌కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
అయినా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని పరిస్థితి చూస్తుంటే అది వస్తోందని అనిపిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా ఆస్పత్రుల్లో సౌకర్యాలను పెంచేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసినట్లు కాథీ హోచుల్ వెల్లడించారు. అవసరమైన ముఖ్యమైన, అత్యవసర మందులను ముందే సిద్ధం చేసుకుంటున్నామని వివరించారు.
More Stories
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!
అంతరిక్షం నుంచి మహా కుంభ మేళా.. ఇస్రో ఫొటోలు