చేతికొచ్చిన వరి పంట కళ్లెదుటే వరద పాలు

‘చేతికొచ్చిన వరి పంట కళ్లెదుటే వరద నీళ్లల్లో మునిగిపోయింది. ఎకరాకు 25ా30 బస్తాల దిగుబడి వచ్చేంది. ప్రస్తుతం పశువుల గడ్డి కూడా దక్కలేదు’ అంటూ వరద బాధిత రైతులు కేంద్ర పరిశీలన బృందం ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. 

అల్పపీడనం కారణంగా చిత్తూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లు, డ్యామ్‌లు, చెరువులు కొట్టుకుపోయాయి. భారీ స్థాయిలో పంట నష్టం వాటిల్లింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం శుక్రవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం, కొంగరవారిపల్లి, కూచివారిపల్లి, రంగంపేట ప్రాంతాల్లో పర్యటించింది. 

దాదాపు మూడు కిలోమీటర్ల మేర కేంద్ర బృందం బీమా నది పరివాహక ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లింది. తెగిన చెక్‌డ్యామ్‌లు, పాడైపోయిన రోడ్లతో పాటు పంట నష్టాన్ని పరిశీలించింది. బాధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకుంది. 

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ భీమవరం, కొంగరవారిపల్లిలో 180 కుటుంబాలున్నాయని, 32 కుటుంబాలకు పూర్తిగా పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. కూచివారిపల్లిలో పది కుటుంబాలు వరి పంటను నష్టపోయాయని, మరో 15 కుటుంబాలకు చెందిన మామిడి చెట్లు నేలవాలాయని కేంద్ర బృందం తీసుకెళ్లారు. చీకలనావ వంక పునరుద్ధరణ చేపడితే తప్ప, వరద నివారణ సాధ్యం కాదని తెలిపారు. 

జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ మాట్లాడుతూ పుంగనూరు నుంచి నది, ఏరు పరివాహక ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లిందని, జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టంపై వివరాలు సేకరిస్తున్నామని కేంద్ర బృందానికి చెప్పారు. తిరుపతిలోని లీలామహల్‌ వద్ద సమాచార శాఖ ఏర్పాటు చేసిన తిరుపతి వరద బీభత్స చిత్రాల ప్రదర్శనను కేంద్ర బృందం తిలకించింది. ఈ బృందం శనివారం తిరుపతి నగరంలో పర్యటించనుంది. 

రాయల చెరువుకు పరిశీలించనుంది. కేంద్రం బృందంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు కునాల్‌ఛత్తర్థి, ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ అభేకుమార్‌, వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.మనోహరన్‌, జలవనరుల శాఖ ఇంజినీర్‌ శ్రీనివాసుబైరి, విద్యుత్‌ మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ శివానిశర్మ, రోడ్లు, హైవే మంత్రిత్వ శాఖ రీజినల్‌ ఆఫీసర్‌ శ్రావణ్‌కుమార్‌, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ అనీల్‌కుమార్‌ సింగ్‌ ఉన్నారు.