ఎపి ప్రభుత్వ నిర్ణయంపై చిరంజీవి అసంతృప్తి

సినిమా టికెట్ల అంశంపై ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేస్తూ  ట్వీట్‌ చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం అంటూ మద్దతు తెలిపారు. అయితే టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించే విధానం పట్ల వ్యతిరేకత తెలిపారు. 
 
థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్‌ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 
 
దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్‌ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం అని పేర్కొన్నారు. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి అంటూ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 
 
ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సినిమాటోగ్రఫీ చట్టం సవరణ బిల్లు ప్రకారం ఇకపై ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమల్లోకి రానుంది. దీంతో  ప్రభుత్వం నిర్దేశించిన మేరకే టికెట్ల ధరలు ఉంటాయి. గతంలో మాదిరి ఇష్టంవచ్చినట్టు టికెట్ల ధరలు పెంచుకోవడం ఇక కుదరదు. పైగా,  దీంతో ఇక నుంచి అన్ని సినిమాలకు ఒకే విధంగా టికెట్ ధరలు ఉండనున్నాయి. అలాగే, రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉంటుంది.