దక్షిణాఫ్రికా ప్రయాణికులపై పలు దేశాల నిషేధం

ద‌క్షిణాఫ్రికాలో తాజాగా బి 1.1.529. క‌రోనా వేరియంట్‌ను క‌ల‌వ‌రం సృష్టిస్తోంది. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్ర‌యాణికుల‌పై పలు దేశాలు నిషేధం విధించాయి. బ్రిటన్, జ‌ర్మ‌నీ, ఇటలీ దేశాలు తొలుత నిషేధం విధించాయి. 

బి.1.1.529. క‌రోనా వేరియంట్ క‌ల‌వ‌ర‌పెడుతున్న నేప‌థ్యంలోనే ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చే విమాన ప్ర‌యాణికుల‌పై నిషేధం విధించిన‌ట్లు యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాల చీఫ్ ఉర్సులా వండ‌ర్ లియోన్  ట్వీట్ చేశారు. జ‌ర్మ‌నీలో శుక్రవారం రాత్రి నుంచి ఆంక్ష‌లు అమ‌ల్లోకి వచ్చాయి. 

కేవ‌లం జ‌ర్మ‌న్ దేశ‌స్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ, వారు కూడా త‌ప్ప‌కుండా 14 రోజుల పాటు క్వారంటైన్ పాటించాల‌ని ఆదేశించింది. ద‌క్షిణాఫ్రికా, లిసోథో, బోత్స‌వానా, జింబాబ్వే, మోజంబిక్, న‌మీబియా దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై రోమ్ నిషేధం విధించింది.

తాజాగా ఆ జాబితాలో ఇటలీ కూడా చేరిపోయింది. గ‌డిచిన 15 రోజుల వ్య‌వ‌ధిలో ఏ ఒక్క‌రోజైనా ఆఫ్రికా ద‌క్షిణ‌ప్రాంత దేశాల్లో ఉన్న వారిని త‌మ దేశానికి అనుమ‌తించ‌బోమ‌ని ఇటలీ ఇవాళ ప్ర‌క‌టించింది. ద‌క్షిణాఫ్రికా, లెసోతో, బోట్స్‌వానా, జింబాబ్వే, మొజాంబిక్‌, న‌మీబియా, స్వాజీలాండ్ దేశాల‌కు ఈ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది.

కొత్త ర‌కం బి.1.1.529 క‌రోనా వేరియంట్‌పై శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం జ‌రుపుతున్నార‌ని ఇటలీ ఆరోగ్య‌శాఖ మంత్రి రోబెర్టో స్పెరాంజా చెప్పారు. వేరియంట్ విస్తృతిని అనుస‌రించి తాము స‌రైన స‌మ‌యంలో మరింత ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. 

ఫ్రాన్స్ సహితం ఆయా దేశాల నుంచి వ‌చ్చే విమానాల‌పై 48 గంట‌ల‌పాటు నిషేధం విధిస్తున్న‌ట్లు ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఒలీవియ‌ర్ వెరాన్ ప్రకటించారు. ఆఫ్రికాలోని ద‌క్షిణ దేశాల్లో కొత్త వేరియంట్ విస్తృతి కార‌ణంగానే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు.

అయితే, యూర‌ప్ దేశాల్లో ఇంత‌వ‌ర‌కు ఎక్క‌డా కొత్త వేరియంట్ జాడ‌లు క‌నిపించ‌లేద‌ని వెరాన్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన అంద‌రినీ క్వారెంటైన్‌లో ఉంచి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయిస్తామ‌ని, అంద‌రి ఆరోగ్య ప‌రిస్థితిని చాలా ద‌గ్గ‌రి నుంచి ప‌ర్య‌వేక్షిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.