గాడిలో పడుతున్న భారత ఆర్ధిక వ్యవస్థ

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా గాడిలో పెడుతుంద‌ని ప్ర‌ముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్ట‌ర్స్ స‌ర్వీసెస్ అంచ‌నా వేసింది. నిరంత‌రాయ వ్యాక్సినేష‌న్ పురోగ‌తితో భార‌త ఆర్థిక కార్య‌కలాపాలు రిక‌వ‌రీ సాధిస్తాయ‌ని గురువారం పేర్కొంది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశ జీడీపీ 9.3 శాతం, 2022-23లో 7.9 శాతానికి ప‌రిమితం అవుతుంద‌ని నిర్ధారించింది.

మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ఉక్కు, సిమెంట్ డిమాండ్‌కు దోహదం చేస్తుందని మూడీస్ పేర్కొంది. మరోవైపు వినియోగం పెరగడం, దేశీయ తయారీకి భారత్ ముందుకు రావడం తదితర అంశాలు కొత్త పెట్టుబడులకు మద్దతునిస్తాయని ఏజెన్సీ పేర్కొంది. 

వ్యాక్సీన్ ప్రక్రియ పెరగడంతో పాటు వినియోగదారుల విశ్వాసంలో స్థిరత్వం, తక్కువ వడ్డీ రేట్లు వంటి సానుకూల అంశాలు ఉన్నాయని సంస్థ తెలిపింది. క‌రోనా ఆంక్ష‌లు స‌డలించ‌డంతో వినియోగ‌దారుల డిమాండ్‌, వ్య‌యం, మాన్యుఫాక్చ‌రింగ్ యాక్టివిటీ రిక‌వ‌రీ దిశ‌గా అడుగులేస్తున్నాయి. 

హై క‌మొడిటీ ధ‌ర‌ల‌తో వ‌చ్చే 12-18 నెల‌ల్లో ప్ర‌ముఖ కంపెనీలు గ‌ణ‌నీయ ప్ర‌గ‌తి న‌మోదు చేస్తాయ‌ని మూడీస్ అన‌లిస్ట్ శ్వేత ప‌టోడియా చెప్పారు. ఆర్థిక వ్య‌వ‌స్థ సుస్థిర రిక‌వ‌రీతో భార‌త్ రుణ ప‌ర‌ప‌తి మూలాలు దేశీయ కంపెనీల‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని మూడీస్ తెలిపింది.

వ్యాక్సినేష‌న్ రేట్ పెరుగుతున్నా కొద్దీ వినియోగ‌దారుల్లో విశ్వాసం స్థిరీక‌ర‌ణ సాధిస్తుందని వ్యాఖ్యానించింది. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న త‌క్కువ వ‌డ్డీరేట్ల‌తో నిధుల ఖ‌ర్చు త‌గ్గ‌డంతోపాటు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా న్యూ క్యాపిట‌ల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని మూడీస్ వివ‌రించింది. 

అయితే ప్ర‌భుత్వ వ్య‌యంలో జాప్యం, ఇంధ‌న కొర‌త‌తో పారిశ్రామిక ఉత్ప‌త్తి త‌గ్గుద‌ల‌కు, త‌క్కువ క‌మొడిటీ ధ‌ర‌ల‌తో కంపెనీల లాభాలు త‌గ్గుముకం ప‌డ‌తాయ‌న్నారు. కాగా 2021-22 సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన జిడిపి (స్థూల జాతీయోత్పత్తి) వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండనుందని ఇంతకుముందు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నివేదిక అంచనా వేసింది. 

ఈ నివేదిక ప్రకారం, 2021-22 సంవత్సరంలో వాస్తవ జిడిపి 9.4 శాతం, 2022-23 సంవత్సరంలో ఇది 7.5 శాతానికి తగ్గుతుందని అంచనా బ్యాంక్ అంచనా వేసింది. 2020-21 సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా భారత్ జిడిపి 7.3 శాతానికి క్షీణించింది. 2021-22 సంవత్సరానికి ఆర్‌బిఐ 9.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఇక 2022-23 సంవత్సరంలో ఇది 7.8 శాతానికి తగ్గుతుందని పేర్కొంది.