జయలలిత మృతిపై వాస్తవాలు బహిర్గతం కావాలి

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వాస్తవాలు బహిర్గతం కావాల్సిన అవసరం వుందని తమిళనాడు  రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అవసరమైతే ఆమె మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీని విస్తరించేందుకు కూడా సిద్ధమేనని తెలిపింది. 
 
ఆ కమిటీ విచారణ తమ చికిత్సపై అనుమానించే ధోరణిలో ఏకపక్షంగా సాగుతోందని ఆరోపిస్తూ జయకు 75 రోజుల పాటు వైద్యం అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ కమిటీలో వైద్య నిపుణులకు సభ్యత్వం కల్పిస్తే తమ చికిత్సపై ఎలాంటి సందేహాలు రావని పేర్కొంది. 
 
అపోలో ఆస్పత్రి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ విచారణపై స్టే విధించింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి అబ్దుల్‌నజీర్‌ నాయకత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. మంగళవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తన వాదనలను వినిపించారు. 
 
ఆర్ముగ స్వామి కమిటీ వాస్తవాలను కనుగొనేందుకు ఏర్పాటైందని, వాస్తవాలను సేకరించడమే కమిటీ ప్రధాన కర్తవ్యమని, ఆ కమిటీలో వైద్యనిపుణులను సభ్యులుగా చేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని తెలిపారు. అయితే ఎయిమ్స్‌ వంటి ప్రముఖ ఆస్పత్రుల నుంచి ప్రభుత్వమే వైద్యనిపుణులను ఎంపిక చేసి కమిటీకి సహకరించేలా చర్యలు చేపడతామని, ఈ విషయంలో అపోలో ఆస్పత్రి యాజమాన్యం జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు. 
 
విచారణ కమిటీ కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, జయ మృతిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జయకు ఎలాంటి మందులు ఇచ్చారు? ఎలాంటి చికిత్స అందించారు? వంటి విషయాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సమగ్రంగా అందించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపారు. 
 
దీనికి వైద్యనిపుణులు విచారణ కమిటీలో సభ్యులుగా ఉండాల్సిన అవసరం లేదని, అయితే సుప్రీంకోర్టు అవసరమనుకుంటే కమిటీలో వైద్యనిపుణులకు సభ్యత్వం కల్పించి కమిటీని విస్తరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.