ఈఎస్‌ఐ స్కాంలో రూ.144 కోట్లు ఈడి స్వాధీనం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్మెంట్‌ విచారణ కొనసాగుతున్నది. తెలంగాణ ఎసిబి కేసుల ఆధారంగా ఈ కేసును ఈడి విచారణ చేస్తున్నది. ఈ స్కాంలో రూ.144 కోట్లు ఈడి స్వాధీనం చేసుకుంది. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికి వరకు 131 ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. 
 
వీటిలో 97 ప్లాట్లు, 6విల్లాలు, 18 కమర్షియల్‌ ఫ్లాట్లు ఉన్నాయని సమాచారం. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వరిరెడ్డి, కె.పద్మ, నాగలక్ష్మి ఆస్తులను ఈడి జప్తు చేసింది. హైదరాబాద్‌, బెంగళూరు, నోయిడా, చెన్నైలలో ఆస్తులను ఈడి జప్తు చేసింది.
 
ఈఎస్‌ఐ మెడికల్‌ స్కాంలో పెద్దమొత్తంలో అక్రమాలు చేసిన దేవికారాణికి సబంధించిన రూ. 6.28కోట్ల విలువైన నగలు ఈడి స్వాధీనం చేసుకుంది. ఈ స్కాంలో మొత్తం 7కేసులను ఎసిబి నమోదు చేసింది. ఈ స్కాంలో ప్రభుత్వానికి రూ. 211 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. 
 
మరోవైపు ఇప్పటికి ఈఎస్‌ఐ ఆసుపత్రులలో సరైన వైద్య సదుపాయాలు లేక, మందులు సక్రమంగా ఇవ్వక లబ్దిదారులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. అంతేకాకుండా వేలాది రూపాయిలను మందులకు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదిలావుండగా ఈ కుంభకోణానికి సంబంధించి ఎసిబి అధికారులు ఎనిమిది కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఇఎస్‌ఐ అధికారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సుమారు రూ.211 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు తేల్చారు. 
 
నిర్ణిత ధర కన్నా నాలుగైదింతలు ఎక్కువకు కొనుగోలు జరిపి కమీషన్లతో పాటు లాభాల రూపంలో భారీగా నగలు, ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దేవికారాణి, నాగలక్ష్మిపిఎంజె జ్యూవెలర్స్ నుంచి సరైన రశీదులు లేకుండా రూ.6 కోట్ల 28 లక్షల విలువైన నగలు కొనుగోలు చేసినట్లు ఎసిబి అభియోగం నమోదు చేసిన విషయం విదితమే.
 
ఇఎస్‌ఐ స్కాంలో మనీలాండరింగ్ జరిగినట్లు లభించిన ఆధారాలతో మనీలాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. గతంలో నిందితులతో పాటు అప్పటి కార్మిక శాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి, పీఎస్ ముకుంద రెడ్డి ఇళ్లల్లోనూ సోదాలు చేసి దాదాపు కోటిన్నర రూపాయలు స్వాధీనం చేసుకుంది.
 
దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న క్రమంలో నిందితులందరూ బెయిల్‌పై విడుదలైనందున ఆస్తులను అమ్మే అవకాశం ఉందని అందువల్లే ఆయా ఆస్తులను తాత్కాలిక జప్తు చేసినట్లు ఇడి వెల్లడించింది.