జీహెచ్ఎంసీలో బీజేపీ కార్పొరేటర్ల మెరుపు ధర్నా

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు మెరుపు ధర్నాకు దిగారు. కార్పొరేటర్లతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఆఫీసులోకి చొచ్చుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో విధ్వసం చోటుచేసుకొంది. 
 
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని, కార్పొరేటర్లకు బడ్జెట్‌ కేటాయించాలనే డిమాండ్లతో బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో మేయర్‌ విజయలక్ష్మి కార్యాలయంలోనికి చొచ్చుకుపోయారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది. 
 
మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్‌ చాంబర్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ గుంపుగా పోగైన వారు జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ కాసేపు బైఠాయించారు. అక్కడి నుంచి మేయర్‌ చాంబర్‌వైపు వెళ్లారు. 
 
కార్పొరేటర్లతో పాటు వారి అనుచరులు దాదాపు రెండొందల మంది వరకు గుంపులుగా చేరడాన్ని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముందుకు దూసుకు వెళ్లారు. ఈ సందర్భంగా వరండాలోని పూలకుండీలను ధ్వంసమయ్యాయి. 
 
మేయర్ చాంబర్‌లో బైఠాయించారు. మేయర్‌కో హటావో.. జీహెచ్‌ఎంసీ బచావో తదితర నినాదాలతో కూడిన పోస్టర్లను చాంబర్‌లో అంటించారు. మెరుపు ధర్నాతో కాసేపు ఏం జరుగుతోందో అక్కడున్నవారికి అర్థం కాలేదు.  ఈ పరిణామాలతో దాదాపు రెండు గంటల పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
 
కార్పొరేటర్లుగా ఎన్నికై ఏడాదవుతున్నా ఇంతవరకు సమావేశాలు నిర్వహించలేదని, కార్పొరేటర్లకు బడ్జెట్‌ కేటాయించలేదని నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
 
సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్, కేటీఆర్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఒకసారి నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో తమ వాణి వినిపించలేకపోయామని పేర్కొన్నారు. పోలీసులు బీజేపీ నేతలు, వారి అనుయాయులను అరెస్టు చేశారు.  
 
సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు పది నెలలు కావస్తుండగా ప్రత్యక్షంగా కౌన్సిల్‌ సమావేశం జరగలేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. రెండుసార్లు ప్రయత్నించినా మేయర్‌ కలవకపోవడంతో కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. 
 
ఓ సారి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినా కూడా ఆమె, జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి రాలేదు. మరోసారి అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన విజయలక్ష్మి.. తన క్యాంపు కార్యాలయానికి రావాలని వారికి సూచించారు. అక్కడికి వెళ్లని బీజేపీ కార్పొరేటర్లు.. జీహెచ్‌ఎంసీ ఆఫీ్‌సలో కలుస్తామని స్పష్టం చేశారు. 
 
గడువు ముగిసి రెండు నెలలైనా మీటింగ్‌ పెట్టలేదనే ఆగ్రహంతో బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ‘మాతో మేయర్‌ సమావేశం నిర్వహించి ఉంటే ఇదంతా జరిగేది కాదు’ అని బీజేపీ కార్పొరేటర్‌ ఒకరు పేర్కొన్నారు. 
 
బిజెపి నేతల దాడి దారుణం 
 
కాగా, మేయర్ ఆఫీస్ పై బీజేపీ నేతలు దాడి చేయడం దారుణమని మేయర్ విజయలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పోరేటర్లు మేయర్ కార్యాయలంలోకి దూసుకురావడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.  బీజేపీ వాళ్లు దురుద్దేశంతో దాడి చేశారని ఆమె విమర్శించారు. 
 
ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ మన కార్పొరేషన్‌ ఆస్తులను మనమే ధ్వంసం చేయడం సరికాదని ఆమె విమర్శించారు. వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా ప్రవర్తించడం దురదృష్టకరం అని ఆమె పేర్కొన్నారు. 
 
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఘటనపైజీహెచ్‌ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు సైఫాబాద్‌  పోలీసులు కేసు నమోదు చేశారు. కుర్చీలు, పూల కుండీలు, టేబుల్, అద్దాలను ధ్వంసం చేయడంతో బీజేపీ కార్పొరేటర్లు సహా 20 మందిపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.   

కార్పొరేటర్లు, పాలక వర్గం ఎందుకు?

జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల అరెస్ట్ ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని ఆయన  డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టకపోవటమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులన్న కనీస స్పృహ లేకుండా  బీజేపీ కార్పొరేటర్ల పట్ల  పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. 

టీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల సంగతేంటో చెప్పాల్సిన పనిలేదని సంజయ్ ధ్వజమెత్తారు. గత సాంప్రదాయాలు, నిబంధనలు పట్టించుకోకుండా  తమ అనుకూల సభ్యులతో  స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయటం టీఆర్ఎస్ నియంతృత్వానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. 

బీజేపీ కార్పొరేటర్లకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించకపోవటం అప్రజాస్వామికమని సంజయ్ ధ్వజమెత్తారు. కరోనా సాకుతో నామమాత్రంగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ పాలనను గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు. 

టీఆర్ఎస్, మున్సిపల్ మంత్రి చెప్పినట్లే జీహెచ్ఎంసీ పనిచేస్తే.. కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ పాలకవర్గం ఎందుకున్నట్టని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే జీహెచ్ఎంసీని నడిపించదల్చుకుంటే  జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. రాజకీయాల పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడం సమంజసం కాదని హితవు చెప్పారు.