క‌ల్న‌ల్ సంతోష్‌బాబుకు మ‌హావీర్ చ‌క్ర ప్ర‌దానం

తెలంగాణ‌కు చెందిన క‌ల్న‌ల్ సంతోష్‌బాబుకు మ‌ర‌ణానంత‌రం మ‌హావీర్ చ‌క్ర‌ను ప్ర‌దానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో ఇవాళ జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్  మ‌హావీర్ చ‌క్ర‌ను అంద‌జేశారు. క‌ల్న‌ల్ సంతోష్‌బాబు స‌తీమ‌ణి, ఆయ‌న త‌ల్లి ఈ అవార్డును అందుకున్నారు. 

గ‌త ఏడాది ల‌డాఖ్‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో చైనా సైన్యాన్ని క‌ల్న‌ల్ సంతోష్‌బాబు ఎదుర్కొన్నారు. గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఈ ఘ‌ర్ష‌ణ‌లో క‌ల్న‌ల్ సంతోష్ అమ‌రుడ‌య్యాడ‌రు. ఆప‌రేష‌న్ స్నో లియోపార్డ్ స‌మ‌యంలో సంతోష్‌బాబు .. శ‌త్రువుల‌ను తుద‌ముట్టిస్తూ త‌న ప్రాణాల‌ను అర్పించారు. 

త‌న పోస్టుపై దాడి చేసిన చైనా సైనికుల్ని క‌ల్న‌ల్ సంతోష్ ధీటుగా ఎదుర్కొన్నారు. క‌ల్న‌ల్ సంతోష్ కుటుంబానికి తెలంగాణ ప్ర‌భుత్వం రూ 5 కోట్లు ఇచ్చింది. సంతోష్‌బాబు భార్య‌కు డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోగంతో పాటు హైద‌రాబాద్‌లోని బంజారా హిల్స్‌లో 700 గ‌జాల ఇంటి స్థ‌లాన్ని కూడా తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ప్ర‌భుత్వం త‌న పుర‌స్కార ప‌త్రంలో క‌ల్న‌ల్ సంతోష్‌ను కీర్తించింది. 16వ‌ బిహార్ రెజిమెంట్‌కు చెందిన క‌ల్న‌ల్ సంతోష్‌బాబు.. ఎంతో ధైర్య‌సాహాసాలు ప్ర‌ద‌ర్శించి శ‌త్రువుల‌కు ఎదురువెళ్లిన‌ట్లు తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ త‌ర్వాత కూడా క‌ల్న‌ల్ యుద్ధ స్పూర్తితో చైనా సైనికుల్ని త‌రిమికొట్టాడు. 

చివ‌రి ప్రాణాల‌తోనూ పోరాడుతూ త‌న బృందంలో ధైర్యాన్ని నింపారు. బిక్కుమ‌ల్లు సంతోష్‌బాబు అసాధార‌ణ నాయ‌క‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించి.. త‌న రెజిమెంట్ సైనికుల్లో స‌మ‌రోత్సాహాన్ని నింపారు. అనిత‌ర‌సామాన్య‌మైన ధైర్యాన్ని, ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శించి.. దేశ‌సేవ‌లో భాగంగా ప్రాణాల‌ను అర్పించిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

జ‌మ్మూక‌శ్మీర్‌లోని కీర‌ణ్ సెక్టార్‌లో ఉగ్ర‌వాదుల‌ను చంపిన పారా స్పెష‌ల్ ఫోర్సెస్‌కు చెందిన సుబేదార్ సంజివ్ కుమార్‌కు మ‌ర‌ణానంత‌రం కీర్తి చ‌క్ర‌ను ప్ర‌దానం చేశారు. సుబేదార్ సంజీవ్ భార్య ఈ అవార్డును అందుకున్నారు. గాల్వ‌న్ లోయ‌లో చైనా ద‌ళాతో ఘ‌ర్ష‌ణ‌ప‌డ్డ నాయక్‌ సుబేదార్ నుదూర‌మ్ సోరెన్‌కు మ‌ర‌ణానంత‌రం వీర చ‌క్ర‌ను ప్ర‌దానం చేశారు. 

ల‌డాఖ్ ఘ‌ర్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన హ‌విల్‌దార్ కే ప‌ళ‌నికి మ‌ర‌ణానంత‌రం వీర చ‌క్ర‌ను ప్ర‌దానం చేశారు. గాల్వ‌న్ యోధుడు నాయిక్ దీప‌క్ సింగ్‌కు మ‌ర‌ణానంత‌రం వీర చ‌క్ర‌ను, నాయిక్ దీప‌క్ సింగ్‌కు వీర‌చ‌క్ర‌ను, సిపాయి గుర్జీత్ సింగ్‌కు వీర‌చ‌క్ర అంద‌జేశారు.