ముంబై ఉగ్రదాడిపై యూపీఏ ప్రభుత్వం ‘మెతక వైఖరి’!

2008, సెప్టెంబ‌ర్ 26న ముంబైలో ఉగ్ర‌వాదులు దాడి సందర్భంగా నాడు అధికారంలో ఉన్న  మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ‘మెతక వైఖరి’ ప్రదర్శించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆనంద్‌పురి సాహిబ్ ఎంపీ మనీష్ తివారీ విమర్శించారు.  మాట‌ల క‌న్నా తీవ్ర స్థాయిలో పాకిస్థాన్‌పై ప్ర‌తి దాడి చేస్తే బాగుండేద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

10 ఫ్లాష్ పాయింట్స్‌, 20 ఇయ‌ర్స్‌.. నేష‌న‌ల్ సెక్యూర్టీ సిచ్యువేష‌న్స్ ద‌ట్ ఇంపాక్టెడ్ ఇండియా అన్న పేరుతో ఆయన వ్రాసిన పుస్తకం విడుదల కానున్నది. ముంబై ఉగ్ర‌దాడులతో పాటు గ‌త రెండు దశాబ్దాల్లో భారత్  ఎదుర్కొన్న జాతీయ భ‌ద్ర‌తా అంశాల‌ను ఆయ‌న త‌న పుస్త‌కంలో వెల్ల‌డించారు. 

ఈ అంశాలు నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, జాతీయ భద్రత అంశాలలో కాంగ్రెస్ పార్టీ ఫేజీ ధోరణి అనుసరిస్తున్నదన్న ఆరోపణలు బలం చేకూరిన్నట్లు అవుతుంది. వందలాది మందిని చంపుతున్నా నాటి ప్రభుత్వం చూపిన `సహనం’ మన బలాన్ని కాకుండా, `బలహీనత’ను వెల్లడించిందని స్పష్టం చేశారు. 

ఆ దాడులు త‌ర్వాత పాకిస్థాన్‌పై శ‌ర‌వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటే బాగుండేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అత్యంత హేయంగా ఉగ్ర‌వాదులు వంద‌లాది మందిని హ‌త‌మార్చాని, అలాంట‌ప్పుడు ఎటువంటి సందేహం లేకుండా పాకిస్థాన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉండే అని మ‌నీష్ తివారి త‌న పుస్త‌కంలో రాశారు.

అయితే నాటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బలనిరూపణను చాటుకునే సంకేతం కాదని, బలహీనతను చాటుకునే సంకేతమని ఆయన విమర్శించారు. వందలాది మంది అమాయకులను ఊచకోత కోస్తున్న పరిస్థితుల్లో సంయమనం పాటించడమనేది బలహీనత చాటుకోవడమే అవుతుందని స్పష్టం చేశారు. 

”మాటల కంటే బలంగా చేతలు చూపించాల్సిన తరుణం అది. 26/11 దాడుల తర్వాత అలాంటి సమయమే వచ్చింది” అని తివారీ తన పుస్తకంలో పేర్కొన్నారు.

ముంబైలో 2008 నవంబర్ 26న వరుస ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఎల్‌ఈటీ ఉగ్రవాదులు 12 చోట్ల ముంబైలో పేలుళ్లు జరిపారు. ఈ వరుస పేలుళ్లలో 150 మందికి పైగా ప్రజల ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చిచంపగా, అజ్మల్ కసబ్‌ను సజీవంగా పట్టుకుని. 2012లో కసబ్‌ను ఉరితీశారు. 

సల్మాన్ ఖుర్షీద్ తర్వాత మరో కాంగ్రెస్ నేత మనీష్ తివారీ యూపీఏను వేలెత్తిచూపారని, 26/11 ఘటన నేపథ్యంలో యూపీఏ అనుసరించిన వైఖరిని, బలహీనతను మనీష్ తివారీ తన పుస్తకంలో బహిర్గతం చేశారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్‌ మాలవీయ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

దాడులకు ఐఏఎఫ్ సిద్ధపడినా యూపీఏ నిలువరించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఫాలి మేజర్ ఇప్పటికే వెల్లడించినట్టు అమిత్ మాలవీయ తన ట్వీట్‌లో గుర్తు చేశారు. 

26/11 ముంబయి ఉగ్రదాడుల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం గట్టిగా స్పందించకుండా జాతీయ భద్రతను పణంగా పెట్టిందని బిజెపి ఈ సందర్భంగా ఆరోపించింది.  బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, యుపిఎ ప్రభుత్వం “పనికిరానిది” అని ఇది ధృవీకరిస్తుందని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం సున్నితత్వం, పనికిరానిది, జాతీయ భద్రత గురించి కూడా పట్టించుకోలేదని తివారీ పుస్తకం ధృవీకరిస్తుందని పేర్కొన్నారు.