పుష్కలంగా ఎరువుల ఉత్పత్తి, ఎలాంటి కొరత లేదు

దేశంలో ఎరువుల ఉత్పత్తి పుష్కలంగా ఉందని, ఎలాంటి కొరత లేదని   కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ భరోసా ఇచ్చారు. అదేవిధంగా దేశంలో వ్యవసాయ అవ‌స‌రాల‌కు తగినంత యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు స్పష్టం చేసారు. 
 
దేశంలో డిఎపి, యూరియా లభ్యతతో పాటు తాజా పరిస్థితిపై రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులతో ఆయన జరిపిన సమీక్షలో 18 రాష్ట్రాల వ్యవసాయ శాఖల‌ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. యూరియా పరిశ్రమల నుంచి బ్లాక్‌ మార్కెట్‌కు తర‌లిపోకుండా, సరిహద్దులు దాటకుండా రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వారిని కోరారు. 
 
భూముల్లో ఉన్న సారాన్ని రక్షించి ఎక్కువ ఉత్పాదకతను అందించే నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువుల కోసం అన్ని విధాలా కృషి చేయాలని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు మన్సుక్‌ మాండవీయ పిలుపునిచ్చారు. డిఎపి కోసం రైతుల నుంచి పెరిగిన డిమాండ్‌ను అధిగమించడానికి గత కొన్ని నెలలుగా రాష్ట్రాలు పూర్తి స్థాయిలో సహకరించాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 
 
సమష్టి కృషి ఫలితంగానే కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు, రాష్ట్రాలకు మధ్య పూర్తి సమన్వయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఎరువులపై ప్రత్యేక డ్యాష్‌బోర్డు, వివిధ జిల్లాల్లో ఎరువుల లభ్యత, రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమర్థవంతమైన సమన్వయం కోసం 24గం.లు పని చేస్తున్న కంట్రోల్ రూమ్ ఏర్పాటు గురించి రాష్ట్ర మంత్రులకు మ‌న్సుక్ మాండ‌వీయ వివ‌రించారు. 
 
రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా ఎరువులను సరఫరా చేస్తున్న‌ద‌ని, రోజువారీ సాధారణ పర్యవేక్షణ, మెరుగైన నిర్వహణ కోసం ప్రత్యేక యంత్రాంగం పని చేస్తున్న‌ద‌ని మాండవీయ తెలిపారు. ప్రధాని ఆదేశాల మేరకు ఎరువులపై సబ్సిడీని అందజేయడం ద్వారా రాష్ట్రాల‌కు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయ‌న చెప్పారు. 
 
ఇదిలావుంటే వివిధ జిల్లాల్లో సమృద్ధిగా ఎరువుల‌ నిల్వలు ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో ఇంకా ఉపయోగించకుండా ఉండిపోయాయని ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వ‌ అధికారులు తెలిపారు. కాగా, ఎరువుల నిర్వహణ కోసం ఎరువుల డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసి రోజువారీ అవసరాలు, సరఫరాను పర్యవేక్షించాలని రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశాయి. 
 
ఎరువుల‌కు సంబంధించి ముందుగా ప్లాన్ చేసుకోవడం, జిల్లాల వారీగా ప్రతి వారం అవసరాన్ని అంచనా వేయడం చాలా ముఖ్యమని రాష్ట్రాల మంత్రులు అభిప్రాయం వ్యక్తంచేశారు.