బడ్జెట్ లక్ష్యం మించి పన్ను వసూళ్లు

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2021-22)లో ప‌న్ను వ‌సూళ్లు బ‌డ్జెట్‌లో నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను అధిగ‌మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ‌త నెలాఖ‌రు నాటికే నిక‌ర ప్ర‌త్య‌క్ష వ‌సూళ్లు రూ.6 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరువ‌లో ఉన్నాయ‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ రెవెన్యూ విభాగం కార్య‌ద‌ర్శి త‌రుణ్ బ‌జాజ్ తెలిపారు. స‌గ‌టున ప్ర‌తి నెలా సుమారు రూ.1.15 ల‌క్ష‌ల కోట్లు వ‌సూల‌వుతున్నాయ‌ని పేర్కొన్నారు.

పెట్రోల్, డీజిల్‌ల‌తోపాటు వంట నూనెల‌పై దిగుమ‌తి సుంకం త‌గ్గించ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయం రూ.80 వేల కోట్లు త‌గ్గుతుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అక్టోబ‌ర్ నాటికే రూ.6 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరువ‌లో ప‌న్ను వ‌సూళ్లు ఉండ‌టం శుభ ప‌రిణామం అని ఆయన తెలిపారు. దానితో ఈ ఏడాది ప‌న్ను అంచ‌నాల‌ను అధిగ‌మిస్తామ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

డిసెంబ‌ర్ నెలాఖ‌రుతో ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు పూర్త‌యిన త‌ర్వాత ప‌న్ను వ‌సూళ్ల‌ను గ‌ణించి బ‌డ్జెట్ ల‌క్ష్యాల‌తో స‌రిపోలుస్తామ‌ని త‌రుణ్ బ‌జాజ్ వివ‌రించారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ప‌న్ను వ‌సూళ్ల‌లో 9.5 శాతం వృద్ధిరేటు అంటే, రూ.22.2 ల‌క్ష‌ల కోట్లు వ‌సూల‌వుతాయ‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2020-21)లో రూ.20.2 ల‌క్ష‌ల కోట్లు వ‌సూల‌య్యాయి.

ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్లు సుమారు రూ.11 ల‌క్ష‌ల కోట్లు ఉంటాయ‌ని అంచ‌నా. వీటిలో కార్పొరేట్ టాక్స్ రూ.5.47 ల‌క్ష‌ల కోట్లు, ఆదాయం ప‌న్ను వ‌సూళ్లు రూ.5.61 ల‌క్ష‌ల కోట్లు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇక అక్టోబ‌ర్‌లో జీఎస్టీ వ‌సూళ్లు రూ.1.30 ల‌క్ష‌ల కోట్లు దాటాయి.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌స్ట‌మ్స్ సుంకం వ‌సూళ్లు రూ.1.36 ల‌క్ష‌ల కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ వ‌సూళ్లు రూ.3.35 ల‌క్ష‌ల కోట్లు ఉంటాయ‌ని భావిస్తున్నారు. ప‌రిహార సెస్‌తోపాటు ప్ర‌భుత్వ జీఎస్టీ వ‌సూళ్లు రూ.6.30 ల‌క్ష‌ల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు.