`విద్యుత్’ బకాయిలపై కేంద్రంతో జగన్ సయోధ్య 

కేంద్రంకు చెల్లించవలసిన బకాయిల గురించి మాట్లాడకుండా మొండికేసిన ఏపీ ప్రభుత్వంతో విసిగివేపారిపోయి, చివరిసారిగా హెచ్చరించి, వినకపోతే `డిఫాల్టర్’ గా ప్రకటించి, మరెవ్వరు రాష్ట్ర ప్రభుత్వంకు ఇకనుండి అప్పులు చేయకుండా చేసేందుకు వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చివరకు `సయోధ్య’కు వచ్చారు. మరోకొంత వ్యవధి కోసం ప్రాధేయపడి, రెండు, మూడు రోజులలో కొంత మొత్తం చెల్లించేందుకు ఒప్పుకొన్నారు. 
 
గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ)లకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా బకాయి పడింది. దీని గురించి ఎన్నిసార్లు, ఎంతగా అడిగినా స్పందించలేదు. దీంతో ఏకంగా ఆ సంస్థల సీఎండీలు సంజయ్‌ మల్హోత్రా, ఆర్‌ఎస్‌ థిల్లాన్‌ మంగళవారం రాత్రి రాష్ట్రానికి వచ్చారు. 
 
బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని విద్యుత్‌సౌధలో ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్‌, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జనార్దనరెడ్డిలతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించింది. గంటపాటు జరగాల్సిన ఈ భేటీ  మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. 
 
అధికార వర్గాల కధనం మేరకు రాష్ట్ర ఇంధన సంస్థలు చెల్లించాల్సిన రూ.2,600 కోట్ల బకాయిల గురించి కేంద్ర ప్రతినిధులు గుర్తు చేశారు. ఇవి చెల్లించకుంటే ఏపీ జెన్కోను నిరర్ధక సంస్థగా ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే తమకు ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కావాల్సి ఉందనిఎం తెలంగాణ నుంచి రూ.6,100 కోట్లు రావాల్సి ఉందని రాష్ట్ర అధికారులు  చెప్పారు. 
 
రాగానే సర్దుబాటు చేస్తామన్నారు. కేంద్ర అధికారులు సంతృప్తి చెందలేదు. ‘‘ఇతర సంస్థల నుంచి మీకు రావాల్సిన బాకీలతో మాకు సంబంధం లేదు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు కట్టాల్సిందే’’ అని మల్హోత్రా, థిల్లాన్‌ స్పష్టం చేశారు. తాము కొత్త రుణం తీసుకుంటున్నామని, అది మంజూరైన వెంటనే  అప్పు తీర్చేస్తామని ఇంధన సంస్థలు హామీ ఇచ్చాయి. ”
 
ఇక్కడ సమావేశం ముగిసిన  తర్వాత ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీల అధికారులు సచివాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మతో సమావేశమయ్యారు. అనంతరం నేరుగా ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత.. జల వనరుల శాఖ అధికారులతో సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ అప్పటికే సీఎస్‌, సీఎంలతో భేటీ అయిన నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. 
 
ఆర్‌ఈసీకి అర్జెంటుగా చెల్లించాల్సిన అప్పు రూ.2500 కోట్లలో రూ.1500 కోట్లు రెండు మూడ్రోజుల్లో చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. మిగిలిన బాకీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌ఈసీ కొంత సమయం ఇచ్చింది. ప్రస్తుతానికి అవసరమైన రూ.1500 కోట్లను ఎస్‌బీఐ నుంచి అప్పు తెచ్చేందుకు రాష్ట్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు కొంతవరకు సఫలమైనట్టు చెబుతున్నారు. 
కాగా, డిస్కమ్‌లను పరిరక్షించేందుకు వీలుగా మూడు లక్షల కోట్ల రూపాయలతో చేపట్టదలచిన రిఫార్మ్‌ ఇన్‌ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్‌ స్కీమ్‌ (ఆర్డీఎ్‌సఎస్‌) పథకాన్ని రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు  చేయనున్నామని.. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్‌ఈసీ సీఎండీ సంజయ్‌ మల్హోత్రా, పీఎ్‌ఫసీ సీఎండీ థిల్లాన్‌లకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ వివరించారని తెలిసింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా ట్రాన్స్‌మిషన్‌ లైన్ల అభివృద్ధి కోసం.. ఫీడర్ల సామర్థ్యం పెంపుదల కోసం.. సబ్‌స్టేషన్ల నిర్మాణం కోసం.. ఇతర సామర్థ్యం పెంపుదల కోసం దాదాపు రూ.31 వేల కోట్లు రుణం అవసరమవుతాయని తెలిపారు.