మమతా బాటలో కేసీఆర్ ….. బిజెపిపై ఘర్షణ ధోరణి!

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేవలం ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతుందో చూసి, రైతుల సాధక బాధకాలు వారి నుండే తెలుసుకోవడం కోసం రెండు రోజులపాటు పూర్వపు నల్గొండ జిల్లాలో జరిపిన పర్యటన పట్ల అధికార  టీఆర్‌ఎస్‌    నేతలు ప్రదర్శించిన అసహనం, దౌర్జన్యం, దాడులు గమనిస్తే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. 
 
హుజురాబాద్ ఉపఎన్నికలో పరాజయంతో ఖంగుతిన్న ఆయన ఇక తన సాధారణ రాజకీయ ఎత్తుగడలతో బిజెపిని ఎదుర్కోలేనని గ్రహించి,  పశ్చిమ బెంగాల్ లో బిజెపి అనూహ్య ఎదుగుదలను ఎదుర్కోవడం కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుసరించిన దౌర్జన్యపూర్వక ధోరణులను  నిర్ణయించినట్లు స్పష్టం అవుతున్నది. 
 
2009 ఎన్నికల ముందు ఆమెతో చేతులు కలిపి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేసిన కేసీఆర్ బిజెపిని ఎదుర్కోవడంలో సహితం ఆమె బాట పట్టేందుకు సిద్దమయిన్నట్లు వెల్లడి అవుతున్నది. అందుకనే మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంపై దండెత్తే విధంగా ధర్నాలకు దిగుతున్నారు.  ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌పై ఒకప్పుడు నిషేధం విధించిన ఇదే టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు అక్కడే ధర్నాకు దిగడం ఆయనలో పెరుగుతున్న అసహనాన్ని వెల్లడి చేస్తుంది. 
 
రాష్ట్రంలో మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ధంగా ఎదురుగుతున్న బిజెపితో రాజకీయంగా పోరాడుతూ వస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో మాత్రం సానుకూల ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. హుజురాబాద్ ఉపఎన్నికల కోసం రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకొంటున్న సమయంలో, అక్టోబర్ మొదటి వారంలో ఢిల్లీలో 8 రోజులపాటు మకాం వేసి, ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలసి సానుకూల సందేశాలు పంపారు. 
 
అయితో హుజురాబాద్ లో మొత్తం బలాన్ని,వనరులను సమీకరించిన తనపై తిరుగుబాటు చేసిన మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ను ఓడించలేక పోవడం, పైగా, భారీ ఆధిక్యతతో తమ పార్టీ అభ్యర్థి ఓటమి చెందడంతో కేసీఆర్ ఖంగుతున్నట్లు కనిపిస్తున్నది. గత ఏడాది దుబ్బాకలో సహితం తనపై తిరుగుబాటు చేసిన మాజీ సహచరుడు రఘునందనరావు బిజెపి అభ్యర్థిగా గెలుపొందిన ఆయనలో పెద్దగా కలవరపాటు కనిపించలేదు. 
 
చివరకు  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో టి ఆర్ ఎస్ తో దాదాపు సమానంగా బిజెపి  డివిజన్లు గెలుపొందిన కేసీఆర్ అంతగా కలత చెందిన్నట్లు లేదు. కానీ హుజురాబాద్ పరాజయం రాష్ట్రంలో ఇక తన ఎత్తుగడలు కాలం చెల్లినదని, ప్రజావ్యతిరేకతను కట్టడి చేయలేకపోతున్నానని గ్రహించినట్లు ఆ తర్వాత ఆయన ధోరణి స్పష్టం చేస్తున్నది. 
 
కేంద్రం తీసుకు వచ్చిన మూడు సాగు చట్టాలకు పార్లమెంట్ లోపల, బయట కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ‘‘పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర  వస్తుందో అక్కడే అమ్ముకోవాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెబుతున్నాయి. ఈ విధానం ఉత్తమం’’ అంటూ ఆయన మద్దతు తెలిపారు. కానీ ఆయన  సాగుచట్టాలకు వ్యతిరేకంగా 2020 డిసెంబరు 8న రైతులు నిర్వహించతలపెట్టిన భారత్‌బంద్‌కు కేసీఆర్‌ పూర్తి మద్దతు ప్రకటించడం గమనార్హం. 
 
రాజకీయ విధానాలపై కేసీఆర్ లో నిలకడ లేదని, ఏరోజుకా రోజు అవసరం బట్టి మాట మారుస్తూ ఉంటారని అందరికి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి తనకు ప్రధానంగా ముప్పని భావించి, బిజెపి పట్ల ఒక విధంగా పట్టించుకోకుండా వచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ రోజురోజుకు తెలంగాణలో మరింతగా బలహీనం అవుతున్నదని, బిజెపి పూనుకొంటున్నదని గ్రహించి, దానిని ఏ విధంగా కట్టడి చేయాలా అని చూస్తున్నారు. 
 
ప్రజలకు ఇచ్చిన వైఫల్యాలను బిజెపి వరుసపెట్టి ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ను నిలదీస్తున్నది. తన పరిపాలనను మార్హ్చుకోవడం ద్వారా, ప్రజలను మెప్పించే ప్రయత్నం చేయకుండా మమతా బెనర్జీ బాటలో దౌర్జన్య చర్యలకు పూనుకోవడం ద్వారా బిజెపిని భయబ్రాంతులకు గురిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించడం ద్వారా ప్రజల దృష్టిని తన వైఫల్యాల నుండి మరల్చడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. 
 
పశ్చిమ బెంగాల్ లో ఏ విధంగా అయితే 1 అసెంబ్లీ సీట్ నుండి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిందో, తెలంగాణలో సహితం ఇప్పటికే 1 సీట్ ను మూడుగా చేసుకున్న బిజెపి ఆ దిశలో సమాయత్తం కావడం కేసీఆర్ లో ఒక విధంగా ఖంగారు పుట్టిస్తున్నది. మమతా బాటలో కేంద్రంపై ఒక వంక విమర్శలు గుప్పిస్తూ, మరోవంక క్షేత్ర స్థాయిలో బిజెపి కార్యకర్తలపై దౌర్జన్యాలకు పూనుకోవడం ప్రారంభించినట్లు వెల్లడవుతుంది. 
 
బండి సంజయ్ పర్యటన సందర్భంగా బీజేపీకి వారికి చెందిన 8 వాహనాలను దగ్ధం చేయడంతో పాటు, దాడులలో 70 మంది బిజెపి కార్యకర్తలు గాయాలకు గురయ్యారు. దౌర్జన్యంకు పాలపడుతున్న తమను కట్టడి చేసే ప్రయత్నం చేసిన పోలీసుల పైననే కొన్ని చోట్ల   టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కర్రలతో వెంబడించిన వీడియోలు వైరల్ కావడం చూసాము. అయితే తెలంగాణ లో బెంగాల్ రాజకీయాలు చెల్లుబాటు కావని కేసీఆర్ గ్రహించాలి.