కేవలం తాయిలాలు పంచి, ఎన్నికల్లో ఓట్లు పొందేవారు

కాంగ్రెస్ 70 ఏళ్ళలో చేసిందేమిటి? అని ప్రశ్నిస్తూ వాళ్ళు కేవలం తాయిలాలు పంచి, ఎన్నికల్లో ఓట్లు పొందేవారని బిజెపి  అధ్యక్షుడు జెపి నడ్డా ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని మోడల్ టౌన్ వద్ద సర్తాక్ చౌపాల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ కాళ్ళపై తాము నిలబడటానికి, సాధికారులవడానికి కాంగ్రెస్ సాయం చేయలేదని విమర్శించారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చి 10 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా ప్రజలను స్వయం సమృద్ధులుగా, సాధికారులుగా చేస్తోందని చెప్పారు. 

ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా వంటి పథకాలు మారుతున్న భారత దేశానికి ప్రతిబింబమని చెప్పారు.పేదలకు కావలసినది డబ్బుకాదని, సాధికారత అని తెలిపారు. ఆయుష్మాన్ యోజన వల్ల 55 కోట్ల మంది లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. 

రిక్షా తొక్కేవారు, క్షురకులు సహా అనేక మంది పేదలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చునని నడ్డా  తెలిపారు. ఎనిమిది కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్లు, విద్యుత్తు సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఇది పరివర్తన చెందుతున్న భారత దేశం దృశ్యమని పేర్కొన్నారు.