రష్యా యాంటీ శాటిలైట్ మిస్సైల్‌ పై అమెరికా ఆగ్రహం

యాంటీ శాటిలైట్ మిస్సైల్‌ను ర‌ష్యా తాజాగా పరీక్షించడంతో  అగ్ర‌రాజ్యం అమెరికా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన రీతిలో, బాధ్యతార‌హితంగా ర‌ష్యా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు అమెరికా పేర్కొన్న‌ది. 

ర‌ష్యా నిర్వ‌హించిన యాంటీ శాటిలైట్ క్షిప‌ణి ప్ర‌యోగం.. అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌లో ఉన్న వ్యోమ‌గాముల‌కు ముప్పుగా మారిన‌ట్లు వెల్ల‌డించింది. కొత్త త‌ర‌హా క్షిప‌ణిని డెవ‌ల‌ప్ చేసిన ర‌ష్యా.. దానితో త‌న స్వంత‌ ఉప‌గ్ర‌హాన్ని పేల్చేసింది. దీంతో రోద‌సీలో శ‌క‌లాల సంఖ్య పెరిగిపోతోంద‌ని, దాని వ‌ల్ల ఆస్ట్రోనాట్లు, కాస్మోనాట్ల‌కు తీవ్ర‌మైన ప్ర‌మాదం ఏర్ప‌డనున్న‌ట్లు అమెరికా ఆరోపించింది.

ఈ ప‌రీక్ష‌లో భాగంగా ర‌ష్యా త‌న స్వంత శాటిలైట్‌ను పేల్చేసుకుంది. ఈ కార‌ణంగా ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్ అప్ర‌మ‌త్తంగా కావాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం అంత‌రిక్ష కేంద్రంలో ఏడుమంది వ్యోమ‌గాములు ఉన్నారు. దాంట్లో న‌లుగురు అమెరిక‌న్లు, ఒక జ‌ర్మ‌న్‌, ఇద్ద‌రు ర‌ష్య‌న్లు ఉన్న‌ట్లు పెంట‌గాన్ చెప్పింది. 

అంత‌రిక్ష కేంద్రం భూమికి సుమారు 420 కిలోమీట‌ర్ల ఎత్తులో భ్ర‌మిస్తున్నది . ర‌ష్యా ప్ర‌భుత్వం అత్యంత నిర్ల‌క్ష్య‌పూరితంగా త‌న స్వంత శాటిలైట్‌ను పేల్చిన‌ట్లు అమెరికా ప్ర‌భుత్వ ప్ర‌తినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ర‌ష్యా నిర్వ‌హించిన యాంటీ శాటిలైట్ మిస్సైల్ ప‌రీక్ష‌ల వ‌ల్ల అంత‌రిక్షంలో సుమారు 1500 శాటిలైట్ శ‌క‌లాలు ఉత్ప‌న్న‌మ‌య్యాయి.

ఇంకా వేల సంఖ్య‌లో చిన్న చిన్న ప‌రిమాణంలో శాటిలైట్ శిథిలాలు ఉన్న‌ట్లు అమెరికా ఆరోపించింది. ర‌ష్యా ప‌రీక్ష వ‌ల్ల అన్ని దేశాల‌కు ప్ర‌మాదం ఎదురైన‌ట్లు అగ్ర‌రాజ్యం పేర్కొన్న‌ది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల నాసా అడ్మినిస్ట్రేట‌ర్ బిల్ నీల్స‌న్ తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు.

ర‌ష్యా వ్య‌వ‌హ‌రించిన తీరు అవివేకంగా ఉంద‌ని, దాని వ‌ల్ల అమెరిక‌న్లు మాత్ర‌మే కాదు, యావ‌త్ స్పేస్ స్టేష‌న్‌కు ముప్పు ఉంద‌ని, త‌మ స్వంత కాస్మోనాట్ల‌కు కూడా స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని, చైనా స్పేస్ స్టేష‌న్‌కు చెందిన టైకోనాట్ల‌కు కూడా విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ట్లు నాసా ఆరోపించింది. కాగా, ఈ ఘ‌ట‌న ప‌ట్ల ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ‌, ర‌ష్యా స్పేస్ ఏజెన్సీ రాస్‌కాస్మోస్ మాత్రం ఇంకా స్పంద‌న ఇవ్వ‌లేదు.