భారత్ సూచించిన శిలాజ ఇంధనాల తగ్గింపుకు ఆమోదం

‘శిలాజ ఇంధనాల నిర్మూలన’ ప్రతిపాదనపై భారత్ చేసిన సూచనలకు ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్ 26 ) ఆమోదం లభించింది. అయితే శిలాజ ఇంధనాల దశల వారీ తగ్గింపునకు ఒప్పందాన్ని పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో హరిత వాయువులతో హానికరమైన వాతావరణానినకి కారణమవుతున్న బొగ్గు వినియోగాన్ని తగ్గించడానికి కుదిరిన తొలి వాతావరణ ఒప్పందం ఇదే కావడం విశేషం.

భూతాపాన్ని నియంత్రించి మానవాళిని రక్షించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ సదస్సు (నిర్మాణాత్మక ఒప్పందంతో ముగిసింది. కొత్త వాతావరణ ఒప్పందానికి దాదాపు 200 దేశాలు ఆమోదం తెలిపాయి. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసే లక్షాన్ని చేరుకోడానికి వీలుగా తదుపరి కార్బన్ కోతలపై చర్చించడానికి వచ్చే ఏడాది సమావేశం కావాలని ఒప్పందంలో దేశాలు అంగీకరించాయి.

ఈ సమావేశ స్ఫూర్తిని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు కాప్ 26 అధ్యక్షుడు అలోక్ శర్మ అభిప్రాయ పడ్డారు. అయితే భారత్ ప్రతిపాదించిన మార్పులపై అనేక దేశాలు విముఖత చూపించాయి.

అభివృద్ది చెందుతున్న దేశాలు తమ అభివృద్ధి లక్షాలు, పేదరిక నిర్మూలన వంటి అజెండాల అమలులో కీలక దశలో ఉన్న సమయంలో శిలాజ ఇంధనాల నిర్మూలన తీర్మానం సహేతుకం కాదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గ్లాస్గో సమావేశానికి వివరించారు. విధ్వంసకర వినియోగానికి వెంటనే ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

పారిస్ వాతావరణ సదస్సు సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను తుచ తప్పకుండా ఆచరించాలని స్పష్టం చేశారు. అయితే శిలాజ ఇంధనాల వినియోగం వల్లనే ప్రపంచం లోని కొన్నిప్రాంతాలు సంపదతో సుభిక్షంగా విలసిల్లుతున్నాయని గుర్తు చేశారు. శిలాజ ఇంధనాల భాధ్యతాయుత వినియోగం అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కని పునరుద్ఘాటించారు.

ఉదాహరణకు భారత్‌లో రాయితీ ధరతో ఇస్తున్న ఎల్‌పీజీ గురించి ప్రస్తావించారు. దీనివల్ల పేద కుటుంబాల్లో కాలుష్యం తగ్గి ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో శిలాజ ఇంధన వినియోగ నిర్మూలన గురించి ఆయా దేశాల హామీని కోరడం దుర్విచక్షణే అవుతుందని స్పష్టం చేశారు.

వాస్తవానికి గ్లాస్గో సమావేశం శుక్రవారమే ముగియాల్సి ఉంది. కానీ ముసాయిదా ఒప్పందం లోని శిలాజ ఇంధన నిర్మూలన ప్రతిపాదనపై భారత్ సవరణలు సూచించడంతో ఒప్పందంపై ఆరోజు ఎలాంటి ఫలితం తేలలేదు. దీంతో శనివారానికి సమావేశాన్ని పొడిగించి చివరకు భారత్ సహా మరికొన్ని దేశాలు చేసిన విజ్ఞప్తులను స్వీకరించిన తరువాత ఆమోదయోగ్య ఒప్పందం తయారు చేశారు.

అయితే కొన్ని దేశాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సమావేశానికి అధ్యక్షత వహించిన భారత సంతతి బ్రిటిష్ మంత్రి అలోక్ శర్మ సభ్య దేశాలకు క్షమాపణలు చెబుతూ కొంత భావోద్వేగానికి గురయ్యారు.