హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగ‌స్వాముల‌కు ఊరట

అమెరికాలోని బైడెన్ స‌ర్కార్ చ్‌-1బీ వీసాదారుల జీవిత భాగ‌స్వాముల‌కు ఆటోమెటిక్ వ‌ర్క్ ఆథ‌రైజేష‌న్ అనుమ‌తులు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల వేలాది మంది ఇండో-అమెరిక‌న్ మ‌హిళ‌ల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. వ‌ల‌స‌దారుల జీవిత‌భాగ‌స్వాముల‌ త‌ర‌పున అమెరిక‌న్ ఇమ్మిగ్రేష‌న్ లాయ‌ర్స్ అసోసియేష‌న్ కోర్టులో కేసు దాఖ‌లు చేసింది. దీనిపై హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ సెటిల్మెంట్ కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

వాస్త‌వానికి హెచ్‌-4 వీసాదారులు ఆటోమెటిక్ ఆథ‌రైజేష‌న్‌కు అర్హులే కానీ, గ‌తంలో వారికి ఆ ల‌బ్ధి చేర‌కుండా ఏజెన్సీ అడ్డుకున్న‌ది. కానీ అలా చేయ‌డం వ‌ల్ల అధిక జీతాలు వ‌చ్చే ఉద్యోగాల‌ను వాళ్లు కోల్పోవాల్సి వ‌స్తోంద‌ని ఇమ్మిగ్రేష‌న్ లాయ‌ర్స్ సంఘం త‌ర‌పున జాన్ వాస్‌డెన్ తెలిపారు.  ఈ నేప‌థ్యంలో వ‌ల‌స‌దారుల భాగ‌స్వాములు ఇమ్మిగ్రేష‌న్స్ లాయ‌ర్స్ సంఘాన్ని ఆశ్ర‌యించారు. హెచ్‌-4 జీవిత భాగ‌స్వాముల‌కు ఊర‌ట క‌ల్పిస్తూ హోంల్యాండ్ సెక్యూర్టీ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీని ప‌ట్ల ఏఐఎల్ డైర‌క్ట‌ర్ జెస్సీ బ్లెస్ సంతోషం వ్య‌క్తం చేశారు.

గ‌తంలో ఒబామా ప్ర‌భుత్వం హెచ్‌-1బీ వీసాదారుల భాగ‌స్వాముల‌కు వ‌ర్క్ ప‌ర్మిష‌న్ క‌ల్పించిన విష‌యం తెలిసిందే. 90 వేల మంది హెచ్‌-4 వీసాదారుల్లో చాలా మందికి వ‌ర్క్ ఆథ‌రైజేష‌న్ ల‌భించింది. వీరిలో ఎక్కువ శాతం మంది ఇండో అమెరిక‌న్ మ‌హిళ‌లే ఉన్నారు.

ఇలా ఉండగా,  అమెరికాలో నివసిస్తున్న ప్రవాసుల జీవితభాగస్వాములకు పనిచేసుకునేందుకు, ఎక్కువ కాలం ఉండేందుకు వాషింగ్టన్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్‌లోని జిల్లా కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. 15 మంది అర్జీదారులు ఈ వ్యాజ్యాన్ని కోర్టులో వేశారు. వారిలో 13 మంది భారతీయులే. దీంతో ప్రవాసుల తాలూకు జీవితభాగస్వాములకు కొంత ఊరట లభించినట్లయింది.

వారిక వర్క్ ఆథరైజేషన్‌కు అప్లయ్ చేయనవసరంలేదు. ఎల్-1, హెచ్1బి వీసాలు కలిగిన ప్రవాసుల జీవిత భాగస్వాముల వర్క్ ఎక్స్‌టన్షన్ ఆటోమేటిక్‌గా 180 రోజులు పొడగించబడతాయి. ఈ మేరకు కోర్టు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యుఎస్‌సిఐఎస్)కు ఆదేశాలిచ్చింది. అయితే ఎల్-1, ఎల్-2 వీసా ఉన్న వారి జీవిత భాగస్వామి అప్లయ్‌చేసుకోకున్నా ఎక్స్‌టెన్షన్ లభిస్తుంది.

కానీ హెచ్4వీసా ఉన్నవారి జీవితభాగస్వామి మాత్రం ఎంప్లాయ్‌మెంట్ పర్మిట్ ఎక్స్‌పైర్ అయిపోయాక ఎక్స్‌టెన్షన్‌కు అప్లయ్ చేయాల్సి ఉంటుంది. హెచ్4 వీసా హోల్డర్లు , హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వామి తమ ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ నవీనికరించుకోలేకపోయినందున ఉద్యోగాలు కోల్పోతున్నారు. దాంతో భారతీయులు, లాయర్లు మార్చ్‌లో అమెరికా ప్రవాస విధానాన్ని సవాలుచేస్తూ క్లాస్ యాక్షన్ సూట్ వేశారు. వారు పాక్షికంగా విజయాన్ని సాధించగలిగారు.