చైనాలో ఇక శాశ్వత అధినేతగా కొనసాగేందుకు అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ఆ పదవిని చేపట్టేందుకు బాటలు పరిచే ఓ చారిత్రక తీర్మానాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) గురువారం ఆమోదించింది. పార్టీ చరిత్ర, జిన్‌పింగ్ హోదాను బలోపేతం చేయడం గురించి ఈ తీర్మానం పేర్కొంది.
దీంతో ఆయన మావో జెడాంగ్, డెంగ్ జియావోపింగ్ తర్వాత శక్తిమంతుడైన నేతగా పట్టు పెంచుకున్నారు. వచ్చే ఏడాదిలో జరిగే సీపీసీ 20వ కాంగ్రెస్ సమావేశంలో ఆయనకు మూడోసారి దేశాధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, నాలుగు రోజులపాటు బీజింగ్‌లో గోప్యంగా జరిగిన సీపీసీ 6వ ప్లీనరీ సమావేశంలో 348 మంది పార్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈ హై ప్రొఫైల్ సమావేశం గురువారంతో ముగిసింది.
సీపీసీ 100 సంవత్సరాల కృషి, సాధించిన విజయాల గురించి ఈ తీర్మానం ప్రస్తావించింది. ఇటువంటి తీర్మానాలు 1945లో మావో జెడాంగ్ హయాంలోనూ, 1981లో డెంగ్ జియావోపింగ్ హయాంలోనూ ఆమోదం పొందాయి. వీటి ద్వారా ఆ నేతలిద్దరూ చైనాలో, సీపీసీలో తమ పాత్రను బలోపేతం చేసుకున్నారు.
దేశాధ్యక్ష పదవిని ఒకే వ్యక్తి రెండు పదవీ కాలాలకు మించి చేపట్టరాదనే నిబంధనను 2018 మార్చిలో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (చైనా పార్లమెంటు) సమావేశంలో ఆమోదించిన తీర్మానం ద్వారా తొలగించారు. దీంతో జీ జిన్‌పింగ్ జీవితాంతం దేశాధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది.
1945లో మావో తన తీర్మానంతో పూర్తి ఆధిపత్యాన్ని పొందారు. ఆ తర్వాత ఆ అధికారంతో ఆయన 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను క్రియేట్ చేశారు. ఇక 1978లో డెంగ్ తన తీర్మానం ద్వారా మావో తప్పులను ఎత్తిచూశారు. 1966 నుంచి 1976 వరకు జరిగిన సంస్కృతి విప్లవంలో లక్షలాది మంది మృతిచెందారని, దానికి మావో కారణమని డెంగ్ ఆరోపించారు.
ఆ తర్వాత దేశంలో బలమైన ఆర్థిక సంస్కరణలకు డెంగ్ పునాది వేశారు. అయితే ఆ ఇద్దరికీ భిన్నంగా జిన్‌పింగ్ తన తీర్మానం ప్రతిపాదించారు. తాజా తీర్మానం ద్వారా తన అధికారాన్ని జిన్‌పింగ్ మరింత కాలం పొడిగించాలనుకున్నట్లు స్పష్టమవుతోంది. ఒక వ్యక్తే ఒక వ్యవస్థగా మారే అవకాశం ఉన్నట్లు ఈ తీర్మానం వెల్లడి చేస్తుంది.
More Stories
అక్రమ వలసదారులను తిప్పి పంపుతా
90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
2025లో ప్రమాదంలో 47 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు