పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చైనా సేనల సర్వే

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గ్రామాలు, సరిహద్దు గస్తీ స్థావరాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఓ నెల క్రితం సుమారు 50 మంది చైనా సైనికులు ఇక్కడికి వచ్చి, బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఈ పరిణామాలను భారత భద్రతా దళాలు నిశితంగా గమనిస్తున్నాయి.

ఓ వార్తా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం, దాదాపు 50 మంది చైనా సైనికులు ఓ నెల క్రితం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుకు చేరుకున్నారు. వీరు సుమారు ఐదుగురు చొప్పున ఓ బృందంగా ఏర్పడి, కేల్, జురా, లీపా సెక్టర్లలో వివిధ గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. 

సరిహద్దుల్లోని గస్తీ స్థావరాల్లో కూడా సర్వే చేస్తున్నారు. వీరితోపాటు పాకిస్థాన్ సైనికులు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారులు కూడా ఉన్నారు.  ఈ ప్రాంతంలో ఆదర్శ గ్రామాల నిర్మాణం కోసం ఈ సర్వే చేస్తున్నట్లు ఓ ప్రభుత్వాధికారిని ఉటంకిస్తూ ఈ వార్తా సంస్థ తెలిపింది.

ఈ గ్రామాలు ప్రజలతోపాటు సైన్యం కూడా ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటాయని తెలుస్తోంది. చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవ (ఎకనమిక్ కారిడార్) ఈ ప్రాంతం గుండా వెళ్తోంది. అందుకే ఈ ప్రాంతంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది.

ఇదిలావుండగా, భారత దేశ భద్రతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ గ్రామాలు ఆరు దశాబ్దాల నుంచి చైనా సైన్యం నియంత్రణలో ఉన్నాయని తెలుస్తోంది. సుబన్‌సిరి జిల్లాలో వివాదాస్పద సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలు చైనా నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో చైనా ఆర్మీ పోస్ట్ కూడా ఉందని తెలుస్తోంది.