8 బృందాలుగా కేంద్ర మంత్రిమండలి

పరిపాలనలో పారదర్శకత, మంత్రిత్వ శాఖల పనితీరు మెరుగుపర్చడం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం  యువ నిపుణులు, పదవీ విమరణ పొందుతున్న అధికారుల నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలని యోచిస్తోంది. ప్రాజెక్టులపై పర్యవేక్షణకు టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తోంది. 

దీనికి 77 మంది ఉన్న కేంద్ర మంత్రిమండలిని 8 బృందాలుగా విభజించిందని సమాచారం. ప్రధాని మంత్రి మోదీ  అధ్యక్షతన జరిగిన ‘చింతన్‌ శివిర్స్‌’ కౌన్సిల్‌ సమావేశాలు ముగిశాక ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో సమావేశం సుమారు 5 గంటల పాటు సాగిందని తెలుస్తోంది.

చివరి సమావేశానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా హాజరయ్యారు. ఎనిమిదింటిలో ఒక్కో బృందానికి క్యాబినెట్‌ మంత్రి సమన్వయకర్తగా ఉంటారు. ఈ బృందాలు తమకు కేటాయించిన శాఖల వనరులు సమకూర్చుకోవడం, పథకాల అమలుపై రిటైర్డ్‌ అధికారుల సూచనలు తీసుకోవడంలాంటివి చేయాల్సి ఉంటుంది. 

ఆయా శాఖల పనితీరును ప్రత్యేకంగా అభివృద్ధి  చేస్తున్న పోర్టళ్లలో మంత్రుల బృందాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తాయి. ఈ మొత్తం బృందాలకు కేంద్ర మంత్రులు హర్దీప్‌ సింగ్‌పూరీ, నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, ధరేంద్ర ప్రధాన్‌, స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకూర్‌లు సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు.