అధునాతన సాంకేతికతలో శిక్షణ ఇవ్వాలి  

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళికల్లో మార్పులు చేస్తూ భవిష్యత్ భారతానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, విశ్వవిద్యాలయాలకు సూచించారు. దేశ అవసరాలకు అనుగుణంగా సరికొత్త కోర్సులను కూడా డిజైన్ చేసుకోవాలని ఆయన సూచించారు.

బెంగళూరులోని  పీఈఎస్ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ.. 4వ పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా విశ్వవిద్యాలయాలు మన యువతకు 5జీ సాంకేతికత, కృత్రిమ మేధ, రొబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక విషయాలను నేర్పించాలని సూచించారు.

విద్యారంగంలో భారతదేశ భవ్యమైన చరిత్రను గుర్తుచేస్తూ, రానున్న రోజుల్లో భారతదేశానికి పునర్వైభవం తీసుకురావడంలో సాంకేతిక విశ్వవిద్యాలయాలు కీలకమైన పాత్రను పోషించాలని ఉపరాష్ట్రపతి చెప్పారు. భారతదేశాన్ని విజ్ఞానకేంద్రంగా మార్చడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కోరారు. 

కేంద్ర ప్రభుత్వం, అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు భాగస్వాముల కోసం అనుమతివ్వడం ఆహ్వానించదగిన పరిణామమన్న ఆయన, డీఆర్డీవో, ఇస్రో సహకారంతో పీఈఎస్ విశ్వవిద్యాలయం రెండు ఉపగ్రహాలను రూపొందిస్తుండటాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ‘మన ప్రయివేటు సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఈ అవసరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మనిర్భర భారత నిర్మాణంలో, అంతరిక్ష రంగంలో అధునాతన సాంకేతిక దేశంగా రూపుదిద్దడంలో ప్రత్యేకమైన చొరవతీసుకోవాలి’ అని సూచించారు.

డ్రోన్ సాంకేతికత ద్వారా వివిధ రంగాలకు ఎంతో మేలు చేకూరుతుందన్న ఉపరాష్ట్రపతి, సృజనాత్మకత, ఐటీ, ఫ్రుగల్ ఇంజనీరింగ్ వంటి వాటిలో అద్భుతాలు సృష్టించే సత్తా భారతదేశానికి ఉందని పేర్కొన్నారు. భారతదేశాన్ని డ్రోన్ హబ్ గా మార్చేందుకు ఎన్నో అవకాశాలున్నాయని చెబుతూ  వాటిని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. 

భారతదేశ ఇంజనీరింగ్ కోర్సుల్లో విదేశీ రచయితలకు సంబంధించిన ఎన్నో సాంకేతిక పుస్తకాలున్నాయని పేర్కొంటూ ఈ అంశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రచయితల ద్వారా భారతీయ భాషల్లో పుస్తకాలు తీసుకొచ్చే దిశగా కూడా ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ప్పారు.  

భారతీయ భాషల్లో సాంకేతిక పుస్తకాలు రావడం ద్వారా యువకులు ఆ పద్ధతులను అవగతం చేసుకుని ఆచరణలో చూపించేందుకు వీలవుతుందని తెలిపారు. సాంకేతికతకు సంబంధించిన పరిశోధనల్లో సామాజిక పరిస్థితుల గురించి ఆలోచించాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఎదురౌతున్న వాతావరణ మార్పులతో పాటు సుస్థిరాభివృద్ధి వంటి వాటిపైనా పరిశోధనలు జరగాలని సూచించారు.  భారతీయ నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి ప్రజాజీవితాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా ప్రయత్నించాలని సాంకేతిక విద్యాసంస్థలకు సూచించారు.