పత్రికలు ప్రజాపక్షం వహించాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, పత్రికలు ప్రజాపక్షం వహించాల్సిన అవసరం ఉందని  ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హితవు చెప్పారు. రాను రానూ పత్రికల విలువల్లో మార్పు వస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఇది కొందరికే వర్తించే అంశమే అయినా,  ఈ దిశగా ప్రతి పాత్రికేయుడు ఆలోచించాలని సూచించారు. మన ఇంట్లో చెద మొదలైనప్పుడు.. ఆ ప్రభావం మన మీద కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమైనా, చక్కటి పథకాలైనా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో కూడిన ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ప్రచార, ప్రసార మాధ్యమాలు పోషించే పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.

 నెల్లూరులో లాయర్ వార పత్రిక 40వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ‘తుంగా పండుగ’లో ఉపరాష్ట్రపతి పాల్గొంటూ స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారి సానుకూల ఫలితాలు సాధించడంలో మీడియా పోషించిన పాత్ర అభినందనీయమని గుర్తు చేశారు.

వ్యవసాయం, మాతృభాష, మహిళల సాధికారత, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, యువత, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల మీద ప్రధానంగా పత్రికలు దృష్టి కేంద్రీకరించాలని ఆయన  సూచించారు. భారతదేశ సంస్కృతిలో మూలభాగమైన వ్యవసాయానికి పత్రికలు, టీవీలు ప్రాధాన్యతను మరింత పెంచాలని, కనీసం ఒక పేజీ, ఓ అరగంట కార్యక్రమం వ్యవసాయం కోసమే కేటాయించాలని చెప్పారు.

పత్రికలు ఏర్పాటుచేయడం ఒక ఎత్తయితే.. దాన్ని నడిపించడం అంతకన్నా కష్టమైన విషయని పేర్కొన్నారు.  నెల్లూరుకు చెందిన లాయర్ వార పత్రిక 40 ఏళ్లుగా నిరాటంకంగా సేవలందించడం అభినందించాల్సిన విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా పత్రిక వ్యవస్థాపకులు తుంగా రాజగోపాలరెడ్డి స్మృతికి నివాళులు అర్పించారు. ముక్కుసూటి మనస్తత్వంతో, నమ్మిన సిద్ధాంత కోసం, ఎంతవారినైనా ఎదిరించి పోరాడగలిగే రాజగోపాల రెడ్డి గారి వ్యక్తిత్వం ప్రతి జర్నలిస్టుకు ఆదర్శం కావాలని చెప్పారు.