రైతుల మహాపాదయాత్రలో లాఠీఛార్జ్

గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా  ప్రారంభమైన అమరావతి రైతుల మహాపాదయాత్ర గత వారం చివరిలో ప్రకాశం జిల్లాలో ప్రవేశించినప్పటి నుండి పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. చివరకు గురువారం రైతులపై లాఠీఛార్జ్ వరకు వెళ్ళింది.    
 
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుండగా  నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌  జరపడంతో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు.
దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయినప్పటికీ పోలీసులు అడ్డుపెట్టిన తాళ్లను నెట్టుకుని మరీ స్థానికులు ముందుకు వచ్చారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు వస్తే అడ్డుకోవడానికి మీరెవరంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
 
 ఎప్పుడైతే పోలీసులు రాజధాని రైతులపై లాఠీ ఛార్జ్‌ చేస్తున్నారని చుట్టూ పక్కల గ్రామాలకు తెలిసిందో, ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు, ప్రజలు, మహిళలు సైతం వేల సంఖ్యలో వచ్చి అమరావతి రైతులకు మద్దతుగా నిలిచారు. పోలీసుల తీరుకు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు విధిస్తున్న ఆంక్షల నడుమే పాదయాత్ర సాగుతోంది.
 
 ఇలా ఉండగా, నాగులుప్పలపాడులోపాదయాత్ర శిబిరం వద్దకు చేరుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఇతరులు పాదయాత్రలో  పాల్గొన కూడదని ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు  స్పష్టం చేశారు. 
 
ఈ మేరకు అమరావతి జేఏసీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా పోలీసుల నోటీసులపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా సాగుతున్న యాత్రకు తమకు నోటీసులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వకుండా తమకు నోటీసు ఇవ్వడమేంటని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
రాజధాని రైతుల పాదయాత్రలో లాఠీ ఛార్జ్ అప్రజాస్వామికం అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గాయాల పాలైనవారికి, చేయి విరిగిన రైతుకు వైద్యం బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. 
పోలీసులు ఈ యాత్రపై ఆంక్షలు పెంచడం, అడ్డంకులు కల్పించడంలో అసలు ఉద్దేశం ఏమిటో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థం అవుతూనే ఉందని ఆయన విమర్సించారు. రోడ్లను దిగ్బంధించి, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఏమిటి? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతోపాటు రైతుల యాత్రను విఫలం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని మండిపడ్డారు.