ప్రభుత్వ ఉద్యోగులమని రిటర్నింగ్‌ అధికారులు మరిచారా!

ప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఒ) మరిచిపోయారంటూ ఎపి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తగిన కారణాలు లేకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏడో డివిజన్‌లో టిడిపి తరఫున బరిలో దిగిన జి.మహేంద్రబాబు నామినేషన్‌ను ఆర్‌ఒ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 17వ వార్డుకు బరిలో ఉన్న షేక్‌ జాఫర్‌ అలీ తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేశారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కేఎం కృష్ణారెడ్డి, ఎన్‌.అశ్వనీకుమార్‌, కంభంపాటి రమేశ్‌బాబు తదితరులు వాదనలు వినిపించారు. ఆర్‌ఒలు అవకతవకలకు పాల్పడుతూ నామినేషన్లు తిరస్కరించారన్నారు. వారు దురుద్దేశంతో వ్యవహరించారని పేర్కొన్నారు.

దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేషన్‌ పత్రాల్లో కొన్నిచోట్ల ఖాళీలు ఉన్నాయంటూ, పత్రాలను సక్రమంగా పూర్తిచేయలేదంటూ చిన్న చిన్న కారణాలతో తిరస్కరించడం ఏమిటని ప్రశ్నించింది. ఆర్‌ఒల తీరును ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఎస్‌ఇసి తరఫు న్యాయవాదికి సూచించింది. 

ఆర్‌ఒలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేరిస్తే నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని పేర్కొంది. తమ నామినేషన్లను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల్లో పాల్గనేందుకు వీలుకల్పించేలా ఆదేశించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. 

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక.. న్యాయసమీక్షకు వీల్లేదని, ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని గతంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రధాన పిటిషన్‌లలో కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.