చివరి దశలో కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రస్తుతం చివరి దశలో ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు. గురువారం ఆయన రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో ‘హర్‌ ఘర్‌ దస్తక్‌’పై వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ  దేశంలో ప్రతి వయోజనుడికి మొదటి డోస్‌ ఇచ్చేలా చూడాలని కోరారు. 

ఇంకా  12 కోట్ల మందికిపైగా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. మహమ్మారికి వ్యతిరేకంగా టీకా, కరోనా-కంప్లైంట్‌ ప్రవర్తన అనే ఆయుధాలు ప్రభావంతంగా ఉంటాయన్న ఆయన  వైరస్‌ పూర్తిగా తొలగిపోయే వరకు మనం విశ్రమించకూడదని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వయోజన జనాభాలో 79శాతం మందికి మొదటి డోస్‌, 38 శాతం మందికి రెండో డోసుల టీకా ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వేగవంతానికి ఉన్న మార్గాలపై చర్చించాలని కోరారు. దేశంలో అర్హత ఉన్న ప్రతి పౌరుడికి వ్యాక్సిన్‌ అందేలా అందరం కలిసి ప్రయత్నిద్దాం అని పిలుపునిచ్చారు.

‘హర్‌ ఘర్‌ దస్తక్‌’లో భాగంగా రెండు డోసుల టీకా వేసేలా ప్రజలను ప్రోత్సహిద్దామని సూచించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నియంత్రించేరందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్న చర్యలపై కేంద్రమంత్రి సమీక్షించారు. టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు నగరాల్లోని బస్‌, రైల్వేస్టేషన్లు, ప్రధాన మెట్రోస్టేషన్ల వద్ద టీకా కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు.

టీకా తీసుకోనని వారిపై అహ్మదాబాద్‌లో ఆంక్షలు 

కాగా, శుక్రవారం నుంచి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, వ్యాక్సిన్‌కు అర్హులైనప్పటికీ మొదటి డోస్ లేదా రెండవ డోస్ తీసుకోని వారిని అహ్మదాబాద్‌లోని ఏటీఎంలు, బీఆర్డీఎస్‌, కంకారియా లేక్‌ఫ్రంట్, కంకారియా జూ, సబర్మతి రివర్‌ఫ్రంట్‌లోకి అనుమతించబోమని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.

లైబ్రరీ, జింఖానా, స్విమ్మింగ్ పూల్, ఏఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సిటీ సివిక్ సెంటర్, కార్పొరేషన్ అన్ని భవనాలలోకి ప్రవేశించే ముందు టీకా ధృవీకరణ పత్రాలను సిబ్బంది తనిఖీ చేస్తారని గుజరాత్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

పిల్లలకు కరోనా టెస్టులు అవసరం లేదు 

ఇలా ఉండగా, అంతర్జాతీయ ప్రయాణికుల ఆగమనానికి సంబంధించి దేశంలో కరోనా నిబంధనలను కొద్దిగా సవరించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు విదేశీ ప్రయాణాలకు వెళ్లేముందు, వచ్చిన తరువాత కొవిడ్ పరీక్షల అవసరం ఉండదు. పెద్దలతో పాటు ఉండే ఐదేళ్లలోపు పిల్లలు ఎటువంటి పరీక్షలు లేకుండానే వెళ్లవచ్చు. 

అయితే క్వారంటైన్ దశలో లేదా వారు ఇక్కడికి వచ్చినప్పుడు కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే సంబంధిత కరోనా  గైడ్‌లైన్స్ పరిధిలో పరీక్షలకు గురికావల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో వైరస్ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఈ విధంగా ఏకంగా నిర్థిష్ట ప్రాంతీయ స్థాయిల్లో హెచ్చుతగ్గుల క్రమంలో కరోనా ఉనికి ఉంది. 

అంతర్జాతీయ పర్యాటకులపై ఇటీవలే అమెరికా ఆంక్షలను ఎత్తివేసింది. ఈ క్రమంలో భారతదేశం నుంచి కుటుంబాలతో పాటు వెళ్లే పిల్లలపై కూడా టెస్టులు తప్పనిసరి అనే నిబంధనలు ఇంతవరకూ ఉన్నాయి. అయితే పలు వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు పిల్లలకు టెస్టులు ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుని ఇందుకు అనుగుణంగా తాజా మార్గదర్శకాలను వెలువరించారు.