కోహ్లి కుమార్తెను బెదిరించింది హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

దేశంలో ఎక్కడ ఉగ్ర  దాడి జరిగినా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరిగినా హైదరాబాద్ తో ఏదో ఒక సంబంధం బైటపడుతున్నది.  తాజాగా ఇతర నేరాలకు సహితం హైదరాబాద్ కేంద్రంగా మారుతున్నట్లు వెల్లడవుతుంది. ఈ నేరాలన్నీ ఎక్కువగా ఇతర రాష్ట్రాల పోలీసుల దర్యాప్తులోనే బైటపడుతూ ఉండడం గమనార్హం.

తాజాగా మొన్నటి వరకు భారత జుట్టు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ పదినెలల కుమార్తెను బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టి కలకలం రేపిన వ్యక్తి హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని ముంబై పోలీసులు కనిపెట్టారు.   

టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని టార్గెట్‌ చేస్తూ.. కోహ్లి కూతురు వామికాను అత్యాచారం పేరుతో సోషల్‌ మీడియాలో కొందరు దుండగులు అసభ్యకర పోస్టులు చేశారు.

తాజాగా కోహ్లి కూతుర్ని అత్యాచారం పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ వారిలో హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్‌ ఉన్నట్లు సైబర్‌ క్రైమ్‌ గుర్తించింది. ఈ మేరకు బుధవారం ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాక్‌తో మ్యాచ్‌ ఓడిన తర్వాత నగేష్‌ సోషల్‌ మీడియాలో కోహ్లి కూతురు గురించి అసభ్యకర మెసేజ్‌లు పెట్టినట్లు తేలింది. 

రామ్‌నగేష్ శ్రీనివాస్ అకుబత్తిని (23) అనే వ్యక్తి బీటెక్ పూర్తి చేసి ఫుడ్ డెలివరీ చేసే ఒక సంస్థలో టెకీగా పని చేస్తున్నాడు. అయితే టీ-20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ చేతిలో ఇండియా టీం పరాజయం అనంతరం ట్విట్టర్ వేదికగా కోహ్లీ చిన్నారి కూతురికి అత్యాచార బెదిరింపులు చేశాడు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

గతేడాది ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూతురికి (అప్పటికి 5ఏళ్లు) కూడా అత్యాచార బెదిరింపులు వచ్చాయి. 2020 అక్టోబర్‌లో జరిగిన ఐపీఎల్‌లో ధోని సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆశించినంతగా రాణించలేకపోయింది. దీంతో ధోనీని టార్గెట్ చేస్తూ నెటిజెన్లు విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ధోని కూతురికి అత్యాచార బెదిరింపులు చేశాడు.