సుశాంత్ సింగ్ కేసులో అమెరికా సహాయం కోరిన సిబిఐ 

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్అ నుమానాస్ప‌ద మృతి కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతూనే ఉంది. ఏడాది దాటిన త‌ర్వాత కూడా దీనిపై ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ.. సాక్ష్యాధారాల సేక‌ర‌ణ కోసం అమెరికా సాయం కోరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. 

సుశాంత్ సింగ్ ఈ-మెయిల్‌, సోష‌ల్ మీడియా ఖాతాల్లో డిలిటెడ్ (తొల‌గించిన) డేటా తిరిగి పొంద‌డానికి సాయం చేయాల‌ని అమెరికాను కోరిన‌ట్లు తెలియ‌వ‌చ్చింది. డేటా రిక‌వ‌రీ చేయ‌డానికి గూగుల్‌, ఫేస్‌బుక్ యాజ‌మాన్యాల‌కు ఇదే త‌ర‌హా రిక్వెస్ట్‌లు పంపిన‌ట్లు స‌మాచారం.

అమెరికా-భార‌త్ మ‌ధ్య ప‌ర‌స్ప‌ర న్యాయ స‌హాయ ఒప్పందం (ఎంఎల్ఏటీ) కింద రెండు దేశాలు త‌మ అంత‌ర్గ‌త కేసుల ద‌ర్యాప్తులో ప‌ర‌స్ప‌రం స‌మాచారం కావాల‌ని కోర‌వ‌చ్చు. గూగుల్ జీ-మెయిల్‌, సోష‌ల్ మీడియా ఖాతాల్లో తొల‌గించిన డేటా ద్వారా సుశాంత్‌సింగ్ మ‌ర‌ణానికి కార‌ణ‌మేమిటో తెలుసుకోవాల‌ని సీబీఐ ఉవ్విళ్లూరుతున్న‌ది.

తొలుత ఈ కేసు ద‌ర్యాప్తును ముంబై పోలీసులు ప్రారంభించారు. ప్ర‌స్తుతం సీబీఐ ద‌ర్యాప్తు చేస్తున్నా.. ఇప్ప‌టికీ సుశాంత్ సింగ్ మ‌ర‌ణానికి కార‌ణం బ‌హిర్గతం కాలేదు. మ‌రోవైపు సుశాంత్ అభిమానులు న్యాయం కావాల‌ని సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ కోరుతున్నారు. ఈ కేసుకు దిశా సాలియ‌న్ ఆత్మ‌హ‌త్య‌కు లింక్ ఉంద‌న్న అనుమానాలు ఉన్నాయి.