విద్యార్థిని సహా ఐదుగురిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఐదుగురు గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కొన్టా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బటెర్‌ గ్రామంపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు గ్రామస్తులను కిడ్నాప్ చేశారు. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన వారిలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కూడా ఉంది.

గిరిజనులను మావోయిస్టులు ఎందుకు కిడ్నాప్ చేశారన్నది ఇంకా తెలియరాలేదని సుక్మా ఎస్పీ సునీల్‌ శర్మ తెలిపారు. కిడ్నాప్ అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. అయితే  సమావేశాల కోసం మావోయిస్టులు గ్రామస్తులను తీసుకెళ్తుంటారని ఆయన పేర్కొన్నారు.

కిడ్నాప్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాలు మావోయిస్టులను కోరాయని ఆయన తెలిపారు.  గత జూలైలో కుందేడ్‌కు చెందిన ఎనిమిది మంది గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని, మూడు రోజుల తర్వాత వారిని క్షేమంగా విడిచి పెట్టారని ఎస్పీ శర్మ వెల్లడించారు.

సీఆర్‌పీఎఫ్ జవాన్ కాల్పుల్లో నలుగురు మృతి 

 ఇలా ఉండగా, సుక్మా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక జవాన్ తోటి సైనికులపై కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్లు మరణించారు.సుక్మాజిల్లా మారాయిగూడ పోలీసుస్టేషను పరిధిలోని లింగాలపల్లిలో సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు  రీతేష్ రంజన్ అనే సీఆర్‌పీఎఫ్ జవాన్ కాల్పులు జరిపాడు. 

ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. మరో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనపై సీఆర్‌పీఎఫ్ దర్యాప్తునకు ఆదేశించింది. కాల్పులు జరిపిన  జవాన్‌ను అధికారులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. జవాన్ల మధ్య సెలవుల విషయంలో ఘర్షణ తలెత్తిన్నట్లు తెలుస్తున్నది.