మళ్ళి విచారణకు ఆర్యన్‌ఖాన్‌ కు ఢిల్లీకి పిలుపు

ముంబై క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్‌ కేసును నార్కోటిక్స్‌ బ్యూరో వేగవంతం చేసింది. కేసు విచారణ ముంబై నుంచి ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి మారగా.. నిందితులందరినీ ఎస్‌సీబీ సిట్‌ మళ్లీ విచారణకు పిలువనున్నది. 

దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఆర్యన్‌ఖాన్‌తో పాటు అతని స్నేహితులు అర్బాజ్‌ మర్చంట్‌, అచిత్‌కుమార్‌ను విచారణకు పిలిచింది. ఈ క్రమంలో ఇద్దరూ ఆదివారం ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌కుమార్‌ సింగ్‌ నేతృత్వంలో ఏజెన్సీ సమన్లు పంపగా.. సిట్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక బంధువు సమీర్‌ను కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీలోని ఎన్‌సీబీ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆపరేషన్స్‌ బ్రాంచ్‌కు చెందిన ఆరుగురు సభ్యులు సిట్‌ బృందం శనివారం రాత్రి ముంబైలోని కార్డెలియా క్రూజ్‌ను పరిశీలించింది. డ్రగ్‌ కేసును తమ ఆధీనంలోకి తీసుకునేందుకు శనివారం అధికారుల బృందం ముంబైకి చేరుకున్నది. ఈ సందర్భంగా ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ ఆరు కేసులను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కేసుల దర్యాప్తులో ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే సహాయం తీసుకుంటామని తెలిపారు. పలు ఆరోపణల నేపథ్యంలో సమీర్‌ను విచారణ నుంచి తప్పించినట్లు వార్తలను ఎన్‌సీబీ ఖండించింది. విచారణ నుంచి ఏ అధికారిని తొలగించలేదని స్పష్టం చేసింది. కేసులో ఎన్‌సీబీ ముంబై యూనిట్‌కు చెందిన అధికారులు అవసరమైన విధంగా దర్యాప్తులో సహకరిస్తారని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ 26 రోజుల కస్టడీ తర్వాత బాంబే హైకోర్టు అక్టోబర్‌ 28న బెయిల్‌ మంజూరు చేసింది. అక్టోబర్‌ 2న గోవాకు వెళ్తున్న కోర్డెలియా క్రూయిజ్‌ షిప్‌పై ఎన్‌సీబీ దాడి చేసి  ఆర్యన్‌ఖాన్‌ అర్బాజ్‌ మర్చంట్‌, మన్మున్‌ ధమేచాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 7 నుంచి ఆర్యన్‌, అర్బాజ్‌ ఆర్థర్‌ రోడ్‌ జైలులో, మున్మున్‌ ధమేచాను బైకుల్లా మహిళా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.