ఏడేళ్లలో 17 రెట్లు పెరిగిన భారత్ సౌరశక్తి

గత ఏడేళ్లలో 17 రెట్లు సౌరశక్తి సామర్థ్యానికి పెంపొందించడం వల్ల ఇప్పుడు 45 గిగావాట్లు మించిన సామర్ధానికి చేరుకోగలిగామని కాప్ 26 దేశాల వాతావరణ సదస్సులో భారత్ తెలిపింది. ప్రపంచ జనాభాలో 17 శాతం జనాభా తమ దేశంలో ఉన్నప్పటికీ సంచిత ఉద్గారాలు మాత్రం కేవలం 4 శాతం మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. 
దేశాలు పరస్పర అభిప్రాయాలను పంచుకునే 11వ సమావేశం(ఎఫ్‌ఎస్‌వి) సందర్భంగా మూడవ ద్వైవార్షిక తాజా నివేదిక (బియుఆర్) లోని అంశాలను భారత్ వెల్లడించింది. ఈ నివేదికను ఫిబ్రవరిలో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజి (యుఎన్‌ఎఫ్‌సిసిసి)కి సమర్పించింది. 
 
ఈ నివేదికపై జరిగిన చర్చలో కీలకమైన అంశాలు 2005 2014 వ్యవధిలో ఉద్గారాలను 24 శాతం వరకు తగ్గించగలగడం, అలాగే జిడిపిని పెంచుకోవడాన్ని ప్రస్తావించారు. భారత్ తరఫున కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సలహాదారు, శాస్త్రవేత్త జెఆర్ భట్ భారత్ సాధించిన అంశాలను వివరించారు.

ప్రస్తుతం ఏటా వెలువడే హరిత వాయువులు 4 శాతం మాత్రమే ఉంటున్నాయని పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు బారత్ గురవుతున్నా అనేక నియంత్రణ చర్యలను భారత్ తీసుకొంటోందని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా పురోగతి కొనసాగుతోందని వివరించారు. భారత్ తీసుకుంటున్న చర్యలను సదస్సులో అన్ని వర్గాలు ప్రశంసించాయి. భారత్ వాతావరణ మార్పులను అదుపు చేసి, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని మౌలిక సౌకర్యాలను తిరిగి సమకూర్చుకునే ప్రయత్నాలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. 

దీనికి భారత్ స్పందిస్తూ వర్ధమాన దేశాలు ప్రకృతి వైపరీత్యాల ముప్పును భారీగా ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సహకారానికి ముందడుగు వేయవలసి ఉందని పేర్కొంది. అటవీకరణ వృద్ధిపై ప్రశ్నకు ఇందులో ప్రజాభాగస్వామ్యం కీలక పాత్ర వహిస్తోందని, భారత్‌లో నాలుగు రకాల పర్యావరణ వ్యవస్థలు అడవుల వల్ల సమకూరుతున్నాయని వివరించారు.

2016 లో వాతావరణం లోని మొత్తం కార్బన్‌డైయాక్సైడ్ వాయువుల్లో భారత్ 15 శాతం వరకు నిర్మూలించ గలిగిందని వివరించారు. భూ వినియోగం, భూ వినియోగం మార్పు, అటవీకరణ (ఎల్‌యుఎల్‌యుసిఎఫ్) వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. 

2015 19 మధ్య కాలంలో 13,031 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు, హరితవనాలు పెంపొందించడమైందని, 235 చదరపు కిలోమీటర్ల పరిధిలో మడ అడవులు పెంపొందాయని, ఆసియా సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు తదితర వన్యప్రాణులు కొన్ని రెట్లు గత ఐదారేళ్లలో పెరిగాయని వివరించారు. వాతావరణ వైపరీత్యాల నివారణలో తీసుకున్న చర్యల ఫలితంగా సుస్థిరాభివృద్దిని భారత్ కొనసాగిస్తోందని భారత్ ప్రకటించింది.