12 వరకు అనిల్‌ దేశ్‌ముఖ్‌ కు ఈడీ కస్టడీ

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదివారం బాంబే హైకోర్టు షాక్‌ ఇచ్చింది. జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి ఈ నెల 12వ తేదీ వరకు ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీకి పంపింది. 

శనివారం పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు శనివారం మాజీ హోంమంత్రిని కస్టడీని పొడగించేందుకు నిరాకరిస్తూ.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్‌ కేసులో 12 గంటల పాటు విచారించిన అనంతరం ఈ నెల 1న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఈ కేసులో ఈడీ పలుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు.

ఈ విషయంలో బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. మాజీ మంత్రికి ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోవడంతో చివరకు ఆయన సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయనను మంగళవారం ప్రత్యేక కోర్టులో హాజరు పరుచగా.. ఈ నెల 6 వరకు ఈడీ కస్టడీకి పంపింది. 

మరో వైపు సీబీఐ కూడా అనిల్‌ దేశ్‌ముఖ్‌ను కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. మాజీ మంత్రిపై దర్యాప్తు సంస్థ ఏప్రిల్‌లో కేసు నమోదు చేసింది. అదే సమయంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది. మాజీ పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే ద్వారా ముంబైలోని వివిధ బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.4.70కోట్లకుపైగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.