‘శ్రీరామాయణయాత్ర’ టూరిస్ట్‌ రైలు ప్రారంభం

ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌  రామాయణ సర్క్యూట్‌లో భాగంగా తలపెట్టిన ‘శ్రీరామాయణయాత్ర’ డిలక్స్‌ ఏసీ టూరిస్ట్‌ రైలు ప్రారంభమైనది. ఆదివారం ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి తొలి పర్యటన శ్రీరాముడితో సంబంధం ఉన్న అన్ని ప్రదేశాలను, ఆలయాలను కవర్‌ చేస్తూ యాత్ర సాగనున్నది. 
 
ఐఆర్‌సీటీసీ ప్రారంభించిన ఈ యాత్రకు భారీ స్పందన లభిస్తున్నది. తొలి పర్యటనకు సంబంధించి అన్ని సీట్లు బుకింగ్‌ జరిగాయని పేర్కొన్నది. పర్యాటకుల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు మళ్లీ ఈ ఏడాది డిసెంబర్‌ 12న రామాయణ యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది.
 
యాత్ర 17 రోజుల పాటు సాగనున్నది. సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో రైలు ప్రారంభమయ్యాక మొదటి హాల్ట్‌ శ్రీరాముడి జన్యభూమి అయోధ్యలో ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడి, హన్మాన్‌ ఆలయాలతో పాటు నందిగ్రామ్‌లో భారత్‌ మందిరాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత బిహార్‌లోని సీతామర్హిలోని సీతామాత జన్మస్థలం, రోడ్డు మార్గంలో ఉన్న జనక్‌పూరిలోని రామ్‌-జానకీ ఆలయాన్ని సందర్శించిన అనంతరం రైలు వారణాసి బయలుదేరుతుంది.
 
పర్యాటకులకు రోడ్డు మార్గంలో వారణాసి, ప్రయాగ, శృంగవర్పూర్‌, చిత్రకూట్‌ దేవాలయాలను సందర్శిస్తారు. వారణాసి, ప్రయాగ, చిత్రకూట్‌లో రాత్రి బసకు ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత రైలు నాసిక్‌కు బయలుదేరుతుంది. ఇక్కడ త్రయంబకేశ్వరాలయం.. పంచవటి తదితర ప్రదేశాలను చూపిస్తారు.
 
అనంతరం కిష్కింధ నగరం హంపి.. ఆ తర్వాత చివరగా రామేశ్వరం తీసుకెళ్తారు. ఆ తర్వాత రైలు 17వ రోజున ఢిల్లీకి తిరిగి చేరుతుంది. పర్యాటకులు దాదాపు 7500 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దేశీయ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘దేఖో అప్పా దేశ్‌’ చొరవలో భాగంగా ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా రామాయణ యాత్ర రైలును ప్రారంభించింది.
ఇందులో ఒక్కో వ్యక్తికి ప్యాకేజీలో భాగంగా సెకండ్‌ ఏసీకి రూ.82.950, ఫస్ట్‌ ఏసీకి రూ.1,02,095 ధర నిర్ణయించారు. రైలు మొత్తం ఏసీ సౌకర్యం కల్పించారు. స్టార్‌ హోటల్‌ స్థాయిలో వసతులు కల్పించగా.. శాఖాహార భోజనం అందించనున్నారు. పర్యాటకులకు బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు.కరోనా మహమ్మారి నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు.
18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న పర్యాటకులందరికీ తప్పనిసరిగా రెండు డోసుల కరోనా  టీకాలు తీసుకుంటేనే అనుమతి ఇస్తున్నారు. ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ గ్లోవ్స్, శానిటైజర్‌ ఉన్న సేఫ్టీ కిట్లను పర్యాటకులందరికీ ఐఆర్‌సీటీసీ అందిస్తున్నది. సంబంధిత రైలు యాత్రల ప్యాకేజిలో భాగంగా ప్రత్యేక టూరిస్టు రైళ్లు, అన్ని సౌకర్యాల డీలక్స్ టూరిస్టు రైళ్లు నడుస్తాయి. మరో నాలుగు రైళ్లు వచ్చే నెలలో ఉంటాయని తెలిపారు. 
 
ఇక దక్షిణ భారతంలో యాత్రా స్థలాలను కలుపుతూ 12 రాత్రులు , 13 పగళ్లు సాగే రామాయణ యాత్ర ఎక్స్‌ప్రైస్ మధురై నుంచి ఈ నెల 16న ఆరంభం అవుతుందని వెల్లడించాయిరు. మధురైలో ఆరంభం అయ్యే ఈ రైలు దిండిగల్, తిరుచిరాపల్లి, కరూర్, ఎరోడ్, సలేం, జోలార్‌పెట్టాయ్, కాట్పాడి, చెన్నై సెంట్రల్ , రేణిగుంట, కడప ఇతర స్థలాలను కలుపుతూ వెళ్లుతుంది.