తెలుగు రాష్ట్రాలలో బలోపేతం పట్ల బిజెపి దృష్టి 

పార్టీ ఇప్పటి వరకు చెప్పుకోదగిన బలం పెంపొందింప చేసుకొని రాష్ట్రాలలో విస్తరించే ప్రయత్నంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పట్టు సంపాదించడం పట్ల బిజెపి దృష్టి సారిస్తున్నది. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారి ఆదివారం ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంకు పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా అధ్యక్షత వహిస్తూ పార్టీ ఇంకా పూర్తిగా బలం చేకూర్చుకోలేదని తనకన్నా ముందు పార్టీకి  సారధ్యం వహించిన అమిత్ షా చెప్పిన మాటలను గుర్తు చేశారు. 
 
కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా,  తెలంగాణలలో బిజెపి తన అడుగుజాడలను విస్తరించాలని పేర్కొన్నారు.  అయితే, ఇటీవలి ఉప ఎన్నికలలో తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ను ఆడిస్తూ బీజేపీ అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తున్నట్లు సూచిస్తున్నదని ఆయన ఆశాభావం  వ్యక్తం చేశారు. ఇంకా ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించని రాష్ట్రాలతో పాటు, వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు కొత్త లక్ష్యాలను ఈ సమావేశంలో ఏర్పరచుకున్నారు.
మొత్తం 10,40,000 పోలింగ్ బూత్‌లలో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, వాటిలో పన్నా ప్రముఖులను (ఓటర్ లిస్ట్ ఇన్‌చార్జ్‌లు) మోహరిస్తామని, వచ్చే ఆరు నెలల్లో ప్రతి బూత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌ను సంస్థాగతం చేస్తామని పార్టీ వెల్లడించింది.  డిసెంబర్ 25 నాటికి బూత్ కమిటీలు, వచ్చే ఏడాది ఏప్రిల్ 6 నాటికి పేజీ కమిటీలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం వివరాలను మీడియాకు వివరిస్తూ తెలిపారు.
బూత్ స్థాయిలో మన్ కీ బాత్ యొక్క సంస్థాగతీకరణ మే 2022 నాటికి జరుగుతోందని కూడా చెప్పారు.   ఎన్నికల సమయంలో ఓటర్లను సమీకరించడంలో పార్టీకి సహాయపడే బూత్ కమిటీలతో పాటు ప్రతి బూత్‌లో పన్నా ప్రముఖ్ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా గుజరాత్‌లో బిజెపి ఒక ప్రయోగం చేసిందని నడ్డా సమావేశంలో తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసిని అధికారం నుండి తరిమికొట్టడంలో విఫలమైన తరువాత బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. టిఎంసి నుండి పార్టీలో చేరిన చాలా మంది నాయకులు వరుసగా పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు. మరోవంక బిజెపి కార్యకర్తలపై అధికార పార్టీ “హింస,  దౌర్జన్యాలు”కు పాల్పడుతున్నప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని పార్టీ నిర్ణయించిన్నట్లు ప్రధాన్ తెలిపారు.

ఎన్నికల అనంతర హింసలో 53 మంది పార్టీ కార్యకర్తలు మరణించారని, డాదాపు లక్ష మంది ప్రజలు ఇప్పటికీ షెల్టర్ హోమ్‌లలో ఉన్నారని కేంద్ర మంత్రి చెప్పారు. అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన  ఎన్‌టి రామారావు  తప్ప, పశ్చిమ బెంగాల్‌లో బిజెపి సాధించినంతగా దేశంలో ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ వృద్ధిని సాధించలేదని ప్రధాన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో బీజేపీకి గట్టిపోటీ ఎదురవుతున్న నేపథ్యంలో, గురుద్వారాల కోసం ఉద్దేశించిన నిధుల కోసం ఎఫ్ సి ఆర్ ఎ అనుమతులు, జి ఎస్ టి  నుండి లంగర్లను మినహాయించడం,  సిక్కుల కోసం చారిత్రాత్మక కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవడం వంటి సిక్కు యాత్రికుల  కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను నడ్డా సమావేశంలో గుర్తు చేశారు. 

 
సమావేశంలో, మహమ్మారి సమయంలో పార్టీని సమర్థవంతంగా నడిపించినందుకు, దేశం 100 కోట్ల వ్యాక్సినేషన్ మైలురాయిని సాధించినందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు అమిత్  షా, నడ్డా, పార్టీ మాజీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీలు ప్రధాని నరేంద్ర  మోదీని సత్కరించారు.

ప్రముఖ పార్టీ నాయకులు ఎల్‌కె అద్వానీ, మురళి మనోహర్ జోషి జాతీయ రాజధానిలోని తమ  నివాసాల నుండి వర్చ్యువల్ గా  సమావేశంలో చేరారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలోని 346 మంది సభ్యులలో, 342 మంది సమావేశానికి హాజరవుతున్నారని, వారందరూ డిజిటల్‌గా తమ పేర్లను నమోదు చేసుకున్నారని ప్రధాన్ చెప్పారు.

వ్యాక్సిన్ తయారీ మరియు ఉచిత రేషన్ పంపిణీకి ప్రభుత్వం అందించిన మద్దతుతో సహా మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేసిన పోరాటం కోసం ప్రధాని మోదీని సమావేశంలో నడ్డా ప్రశంసించారు.   ఆర్థిక రంగంలో మంచి సంకేతాలతో దేశం సాధారణ స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రధాని దూరద్రుష్టిని ఆయన్న కొనియాడారు.