రైతుల మహాపాదయాత్రను భగ్నం చేసేందుకు కుట్రలు

అమరావతి రైతుల మహాపాదయాత్రను భగ్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, కృత్రిమ దాడులు జరిగే అవకాశం ఉందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. . మహాపాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోందని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని చెప్పారు. ఇది కొంతమంది కుట్రలు చేసే వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని పేర్కొన్నారు. 

అమరావతి విషయంలో సీఎం జగన్‌ ఎప్పుడూ అక్కడి రైతులు, ప్రజలను పిలిచి మాట్లాడలేదని ఆయన గుర్తుచేశారు. రాజధాని రైతులు అంటే టీడీపీ నేతలా అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారని తెలిపారు. పాదయాత్రలో పాల్గొన్న జేడీశీలం, రావెల కిశోర్‌బాబు టీడీపీ నేతలా అని ప్రశ్నించారు. 

కాగా, తన కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసి తనను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రఘురామరాజు ఆరోపించారు. కిడ్నాప్‌ చేయడానికి రెక్కీ నిర్వహించినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విషయంపై ఆధారాలతో సహా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఏపీ డీజీపీ అడిగితే వివరాలు సమర్పిస్తానని చెప్పారు. 

సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనే కేంద్ర సంస్థను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా ఒక కంపెనీకి విద్యుత్‌ కొనుగోలు టెండర్‌ కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోలేదని గుర్తుచేశారు. ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికి చేసుకున్న ఒప్పందంతో రాష్ట్ర ప్రజలపై రూ.1.6లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, ఐఎన్‌ఎ్‌స విశాఖ యుద్ధనౌక పేరును ‘‘ఏపీ ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌’’గా మార్చుతున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు రఘురామరాజు లేఖ రాశారు. యుద్ధనౌక పేరును మార్చవద్దని విజ్ఞప్తి చేశారు.