దీపావళి అమెరికాలోనూ సెలవు దినం!

దీపావళిని అమెరికాలోనూ సెలవు దినంగా ప్రకటించాలంటూ ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)కు ఒక బిల్లు వచ్చింది. ఈ మేరకు ప్రతిపాదన చేస్తూ ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్‌ బి మలోనే ప్రతినిధుల సభ లో బిల్లును ప్రవేశపెట్టారు.  దీనిపై చర్చ జరిగిన తర్వాత దీన్ని ఆమోదిస్తారు. అమెరికా చట్టసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందితే.. ఇక అక్కడ కూడా దీపావళి రోజు అధికారికంగా సెలవుగా ప్రకటిస్తారు. దీపావళిని ఫెడరల్‌ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించాలని మలోనే కోరారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘దీపావళి డే యాక్ట్‌’ బిల్లును సభలో ప్రవేశపెట్టడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగను జరుపుకోవడం విశేషమని పేర్కొంటూ కరోనాపై పోరాటం కొనసాగుతున్న సమయంలోనూ ఈ పండగకు ప్రాధాన్యముందని  ఆమె పేర్కొన్నారు.
 
“దీపావళి వంటి వేడుకలు మన దేశం సంతోషం, స్వస్థత, అభ్యాసం, కాంతి, అనిశ్చిత సమయాలకు దారిచూపేలా ఉండాలని మనమందరం కోరుకునే ప్రధానాంశాన్ని తెలియజేస్తాయి. నా సహోద్యోగులు, భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ నాయకులు, నేను ఈ భయంకరమైన చీకటి మహమ్మారి నేపథ్యంలో దీపావళిని ఫెడరల్ సెలవుదినంగా మార్చడానికి మంచి సమయం మరొకటి లేదని నమ్ముతున్నాను”అని మలోనీ వివరించారు.
 
ప్రపంచ వ్యాప్తంగా దీపావళి పర్వదినం జరుపుకొంటున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె తన ప్రతిపాదనను సభ ముందుంచుతూ ఈ పండుగ కేవలం భారత సంతతి వారికి మాత్రమే కాకుండా, అమెరికా ప్రజల అందరికి ముఖ్యమైనదని ఆమె తెలిపారు. 
 
 కాగా, ఈ బిల్లుకు భారతీయ అమెరికన్‌ రాజా కృష్ణమూర్తితో పాటు పలువురు కాంగ్రెస్‌ సభ్యులు, విదేశీవ్యహారాల కమిటీ ఛైర్మన్‌ గ్రెగరీ మీక్స్‌ మద్దతు తెలిపారు. రాజా కృష్ణమూర్తి అమెరికా కాంగ్రెస్‌లో కూడా  దీపాల పండుగ మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

“ఈ దీపావళి పర్వదినాన మనం చెప్పాలి, మీరు ప్రపంచంలో చూడాలనుకునే వెలుగుగా ఉండండి. చీకటిని పారద్రోలడానికి అవసరమైన మీ సమాజంలో వెలుగుగా ఉండండి. నిస్సహాయులకు ఆశలు కలిగించే ఈ సమాజంలో వెలుగుగా ఉండండి. చివరివారికి, చిన్నవారికి సహాయపడే వెలుగుగా ఉందాం. అదే దీపావళి. అందుకే దీపావళిని ఫెడరల్ హాలిడేగా భావించాలి” అని కృష్ణమూర్తి కోరారు, దీపావళి పర్వదినాన్ని భారతీయ-అమెరికన్‌లను జరుపుకోవడం గురించి కూడా ప్రస్తావించారు.