ఉగ్రవాద దాడిలో తాలిబన్ సీనియర్ కమాండర్ మృతి

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని నగరం కాబూల్‌లోని సైనిక ఆసుప్రతిపై మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో తాలిబన్ సీనియర్ కమాండర్ హమ్‌దుల్లా మొఖ్లిస్ మరణించినట్లు తాలిబన్ అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఉగ్రవాద దాడిలో 19 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. 

మొఖ్లిస్ ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్ సభ్యుడు, ప్రత్యేక దళాల అధికారి కూడా. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత మరణించిన ఆ సంస్థ ఉగ్రవాదుల్లో మొఖ్లిస్ సీనియర్. తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్‌లో హింసాకాండ తీవ్రంగా ఉంది. ఉగ్రవాద దాడులు ఆ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం జరిగిన దాడి గురించి ఇస్లామిక్ స్టేట్-ఖొరసాన్ ఉగ్రవాద సంస్థ తన టెలిగ్రామ్ చానల్‌లో వివరించింది. ఐదుగురు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఫైటర్లు ఏకకాలంలో సమన్వయంతో దాడులు చేశారని తెలిపింది.

తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, ఈ దాడిని 15 నిమిషాల్లోనే తిప్పికొట్టినట్లు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఆసుపత్రిలోని రోగులు, వైద్యులు, సామాన్యులపై దాడి చేయాలనుకున్నారన్నారు. అమెరికా మద్దతుతో ఏర్పడిన గత ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్లలో ఒకదాని ద్వారా తాలిబన్ స్పెషల్ ఫోర్సెస్‌ను ఈ ఆసుపత్రి పై కప్పుపైకి దించినట్లు తెలిపారు. 

ఈ దాడి గురించి ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఆత్మాహుతి బాంబర్ ఆసుపత్రి ప్రవేశ మార్గంలో తనను తాను పేల్చుకున్నాడని, ఆ తర్వాత అతనితోపాటు వచ్చిన గన్‌మెన్ ఆసుపత్రిలోకి చొరబడి కాల్పులు జరిపారని చెప్పారు. ఈ దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 50 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. 

ఆఫ్ఘన్‌లో విదేశీ కరెన్సీపై నిషేధం
 
 కాగా,ఆఫ్ఘనిస్థాన్‌లో విదేశీ కరెన్సీని ఉపయోగించడంపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. తాలిబన్లు ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ కరెన్సీ ఆఫ్ఘని విలువ క్షీణించింది. ఆ దేశ నిధులను విదేశాల్లో స్తంభింపజేశారు. ఆఫ్ఘనిస్థాన్ బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది.
మరోవైపు ఆ దేశంలో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావడం లేదు. ఆ దేశంలో అనేక లావాదేవీలు అమెరికన్ డాలర్లలో జరుగుతాయి. దక్షిణ సరిహద్దుల్లోని వాణిజ్య మార్గానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పాకిస్థానీ రూపాయలను ఉపయోగిస్తున్నారు.

తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇకపై దేశీయ వ్యాపార, తదితర కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీని ఉపయోగిస్తే, కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతామని హెచ్చరించారు. ఆర్థిక పరిస్థితి, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆఫ్ఘన్లంతా ఆఫ్ఘని కరెన్సీని మాత్రమే ప్రతి లావాదేవీలోనూ ఉపయోగించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలంతా విదేశీ కరెన్సీ లావాదేవీలను మానుకోవాలని స్పష్టం చేశారు.