2030 కల్లా అడవుల నరికివేతను ఆపుదాం 

మరో 10ఏళ్ళలో, అంటే 2030కల్లా అడవుల నరికివేతను ఆపుచేయడానికి, విరివిగా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి వందమందికి పైగా ప్రపంచ నేతలు వాగ్దానం చేశారు. కాప్‌ 26 వాతావరణ సదస్సులో ఇది మొదటి ప్రధాన ఒప్పందం. ఇందుకోసం 1400 కోట్ల యూరోలతో ప్రభుత్వ, ప్రైవేటు నిధులను ఏర్పాటు చేస్తామని కూడా ప్రతిన చేశారు. ఈ మేరకు మంగళవారం ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల్లో బ్రెజిల్‌ వుంది. బ్రెజిల్‌లో ఇటీవల కాలంలో అమెజాన్‌ వర్షాధార అడవులను విస్తారంగా నరికేస్తున్నారు. 
 
నిపుణులు ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. కాగా,  2014లో కూడా ఇలాంటి ఒప్పందమే కుదిరిందని, అడవుల నరికివేతను తగ్గించడంలో విఫలమైందని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్బన్‌ డయాక్సైడ్‌ను ఎక్కువగా పీల్చుకునే చెట్లనే నరికివేయడంతో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
గతంలో కన్నా ఎక్కువ మంది నేతలు, మొత్తంగా 110 మంది ఈ చారిత్రక ఒప్పందంలో భాగస్వాములయ్యారని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. అడవుల నరికివేత వల్ల జరుగుతున్న విధ్వంసాన్ని మనం నిలుపుచేయాల్సి వుందని ఆయన స్పష్టం చేశారు. ”ప్రకృతిని జయించిన వారిగా మానవాళి పాత్రకు ఇక అంతం పలకాలి.  అందుకు బదులుగా ప్రకృతి పరిరక్షకులుగా మారాల్సివుందని” ఆయన చెప్పారు.
1400 కోట్ల యూరోలతో ఏర్పాటు చేసే నిధిలోల కొంత భాగం వర్ధమాన దేశాలకు వెళుతుంది. దెబ్బతిన్న భూములను పునరుద్ధరించడానికి, దావానలాన్ని ఎదుర్కొనడానికి, ఆదివాసీలకు తోడ్పాటునందించడానికి ఆ మొత్తాలను ఉపయోగిస్తారు. పామాయిల్‌, సోయా, కోకా వంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ప్రపంచ వాణిజ్యం నుండి అడవుల నరికివేతను తొలగించడానికి 28 దేశాల ప్రభుత్వాలు కట్టుబడి వున్నాయి.
అడవుల నరికివేతతో ముడిపడిన కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టబోమని ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్‌ కంపెనీలు 30కి పైగా హామీ ఇచ్చాయి. కాంగో బేసిన్‌లోని రెండవ అతిపెద్ద వర్షాధార అడవుల పరిరక్షణ కోసం 1100 కోట్ల యూరోల మొత్తాన్ని కేటాయించనున్నారు.
అడవుల నరికివేతను అడ్డగించేందుకు అనేక దేశాల నుండి రాజకీయ నిబద్ధత రావడం స్వాగతించదగ్గ పరిణామమని, ఈ దిశగా ముందుకు సాగడానికి గణనీయమైన మొత్తాల్లో నిధులు కూడా కేటాయించడం హర్షించదగ్గ విషయమని లండన్‌ యూనివర్శిటీ కాలేజీలో వాతావరణ నిపుణుడు ప్రొఫెసర్‌ సిమన్‌ లూయిస్‌ వ్యాఖ్యానించారు.