జిన్నాను పటేల్‌తో ఎట్ల పోలుస్తవ్..

పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ పొగడ్తలతో ముంచెత్తడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిన్నాను గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్‌లతో సమానంగా అఖిలేశ్ చెప్పడాన్ని తప్పుబడుతూ అఖిలేశ్ తీరు సిగ్గుచేటని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు.

అఖిలేష్ ఒక సభలో మాట్లాడుతూ జిన్నాను గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుడిగా పేర్కొన్నారు. గాంధీజీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నెహ్రూ, జిన్నా అంతా ఒకే చోట బారిస్టర్ చదివారని, ఆ తర్వాత వీరంతా భారత స్వాతంత్య్ర  పోరాటంలో కీలకంగా వ్యవహరించారని  కొనియాడారు.

పైగా, పోరాటానికి వారెన్నడూ వెనకడుగు వేయలేదని అఖిలేశ్ చెప్పారు. రైతుల కోసం పోరాడినందుకే పటేల్‌కు సర్దార్ బిరుదు వచ్చిందని.. కానీ ఆయన బాటలో పయనిస్తున్నామని చెప్పుకునే బీజేపీ ఇప్పుడు రైతులను ఏడిపిస్తోందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని పటేల్ నిషేధించారని, ఆ సిద్ధాంతాన్నే అనుసరిస్తున్న కొందరు ఓ వైపు దేశ ఐక్యత గురించి మాట్లాడుతూ, మరోవైపు కులమతాల పేరుతో దేశాన్ని విభజిస్తున్నారని అంటూ బీజేపీని లక్ష్యం చేసుకొని విమర్శలు గుప్పించారు. 

‘‘నిన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్.. జిన్నాను సర్దార్ పటేల్‌తో పోల్చి మాట్లాడారు. ఇది సిగ్గుచేటు. విభజనను కోరుకునే తాలిబాన్ మనస్తత్వం ఇది. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ఏక్తా భారత్ శ్రేష్ఠ భారత్ (ఒకే భారత్.. ఉన్నతమైన భారత్)’ సాధన దిశగా పని చేస్తున్నాం” అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అఖిలేశ్ యాద‌వ్‌ది తాలిబ‌న్ మైండ్‌సెట్ అని ఆదిత్య‌నాథ్ వ్యాఖ్యానించారు.

“వారు విజయం సాధించలేనప్పుడు ‘మహాపురుషులు’ (మహోన్నత వ్యక్తులు)పై నిందలు వేస్తున్నారు. మొత్తం సమాజాన్ని అవమానిస్తున్నారు” అంటూ ధ్వజమెత్తారు. ఇటువంటి ధోరణిని అంగీకరించలేమని స్పష్టం చేస్తూ, అందరూ ఖండించాలని ముఖ్యమంత్రి చెప్పారు. సర్దార్ పటేల్‌ను అవమానించినందుకు అఖిలేష్ పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు.

స్వేచ్ఛా భారతదేశాన్ని ‘అవిభజన’గా ఉంచిన ఘనత సర్దార్ పటేల్‌కే దక్కుతుందని చెబుతూ జిన్నాను సర్దార్ పటేల్‌తో పోల్చడం ద్వారా ఆయనను కీర్తించాలనే విభజన మనస్తత్వం మళ్లీ వెలుగులోకి వచ్చిందని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. దేశ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఈ విభజన మనస్తత్వాన్ని ఎప్పటికీ అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు. 

యూపీ డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య స్పందిస్తూ.. అఖిలేశ్ యాద‌వ్‌ను అఖిలేశ్ అలీ జిన్నా అని, ఆయ‌న పార్టీ న‌వాజ్‌వాదీ పార్టీ అని ఎద్దేవా చేశారు. బుజ్జ‌గింపు రాజ‌కీయాల కోసం స‌ర్దార్ ప‌టేల్‌ను కించ‌ప‌రిచార‌న్నారు.

కాగా,  పాకిస్థాన్ జాతి పిత మహ్మద్ అలీ జిన్నాను పొగిడితే భారత్‌లో పొంగిపోయే వారెవరూ లేరని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అఖిలేష్ కు హితవు చెప్పారు. ఒక వర్గం ప్రజల్ని సంతోషపెట్టడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటూ ఆయన తన సలహాదారులను మార్చుకోవాలని చురకలంటించారు.

అఖిలేశ్ చరిత్ర చదవాలని సూచిస్తూ అసలు భారత ముస్లింలకు జిన్నాతో ఏం సంబంధమని ఒవైసీ ప్రశ్నించారు. ద్విజాతి  సిద్ధాంతాన్ని మన పెద్దలు వద్దనుకున్నారని, అందుకే భారత్ లో  ఉండటానికి నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.