హుజురాబాద్ లో కేసీఆర్ కు పరాభవం, ఈటెల ఘన విజయం

హోరాహోగా జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరాభవం తప్పలేదు. కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు చేసి, బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఘనవిజయం సాధించారు. దాదాపు అన్ని రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శిస్తూ వస్తున్న ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌‌ పై 23, 865 ఓట్ల ఆధిక్యతతో  సునాయానంగా గెలుపొందారు.

ఏడవసారి ఇక్కడి నుండి ఎమ్యెల్యేగా గెలుపొందడం ద్వారా  నియోజకవర్గంపై తనకున్న పట్టును ఈటల మరోసారి నిరూపించుకున్నారు. గత ఏడాది కేసీఆర్ కు కంచుకోటగా పేరొందిన దుబ్బాక ఉపఎన్నికలో గెలువపండిన బిజెపికి హుజురాబాద్ విజయం మరింత బలం చేకూరుస్తుంది. రాజేందర్ తో శాసనసభలో బిజెపి సభ్యుల సంఖ్య  ముందుకు పెరగనున్నది.

తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటెల రాజేందర్‌కు సొంత నియోజకవర్గంలోనే ఓటమి రూచి చూగెలుపొంది పించాలని తీవ్రంగా ప్రయత్నించిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చివరకు పరాభవమే మిగిలింది. అస్త్రశస్త్రాలన్నీ వాడినా, అధికార బలాన్ని ఉపయోగించినా, పథకాల వ్యూహాలను రచించినా, భారీగా ధన ప్రవాదం పారింప చేసినా ఈటల గెలుపును మాత్రం టీఆర్ఎస్ అడ్డుకోలేకపోయింది.

కేసీఆర్ మంత్రివర్గంలో ఉంటూ ఒకానొక సందర్భంలో  గులాబీ జెండాకు మేం ఓనర్లం అనే పదాన్ని ఈటల రాజేందర్ ప్రయోగించినప్పటి నుండి ఆయనను దూరంగా ఉంచుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయనపై భూఆక్రమణ కేసులు నమోదవడం, మంత్రివర్గం నుండి తొలగించడం వెంటవెంటనే జరిగిపోయాయి. దానితో ఈటెల ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి, బీజేపీలో చేరి పోరుకు సిద్ధమయ్యారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో లేని వాళ్లను, టీఆర్ఎస్‌పై దాడులు చేసిన వాళ్లను, కేసీఆర్‌ను విమర్శించిన వాళ్లను బంగారు తెలంగాణ పేరుతో పార్టీలోకి రప్పించుకుని,  ఉద్యమ సమయం నుంచి వెన్నంటే ఉన్న ఈటలకు మాత్రం కేసీఆర్ అన్యాయం చేశారన్న భావన తెలంగాణ ప్రజల్లోకి మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ప్రజల్లోకి వెళ్లిపోయింది.

పార్టీ నుంచి ఈటెల బయటకు వచ్చే ముందు ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈటెల భూకబ్జాలకు పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయాక ఈటలపై అవినీతి ఆరోపణలు తగ్గిపోయాయి. నిజంగానే అవినీతి చేసి ఉంటే ఇన్నాళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న దానికి టీఆర్ఎస్ నుంచి సమాధానం రాలేదు. 

దీంతో ఈటలపై ప్రజలకు నమ్మకం, సానుభూతి పెరిగాయి. అంతేకాకుండా పార్టీలో కొత్తగా చేరిన వాళ్ల పెత్తనాన్ని సహించలేక ప్రశ్నించడం వల్లనే ఇదంతా జరిగిందన్న భావన కూడా ప్రజల్లో కలిగింది. ఈటలను ఒక్కరిని ఓడించడం కోసం హరీశ్ రావు నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హుజూరాబాద్‌లో తిష్ట వేయడం, రాజకీయ వ్యూహాలను రచించడం కూడా ఆ ప్రాంత ప్రజలకు రుచించలేదు. 

ఒక్కడిని ఓడించడం కోసం ఇంత చేయాలా? అన్న విస్మయం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలంతా ఈటలపై మూకుమ్మడిగా మాటల దాడి చేయడంతో ఆయన ఒంటరివారయ్యారన్న భావన కలిగింది. అందుకే కేసీఆర్ పథకాలతో ప్రలోభ పెట్టినా హుజూరాబాద్ ప్రజలు ఈటల వెంటే నిలిచారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రకటించిన దళితబంధు పథకం పెద్దగా కలిసి రాలేదు. ఆ పథకాన్ని ప్రారంభించిన గ్రామంలో కూడా మెజారిటీ రాలేదు. ఓట్ల కోసమే ఈ పథకాన్ని తెచ్చారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. అంతేకాకుండా ఇతర కులాల్లోని నిరుపేదలు ఇలాంటి పథకం తమకోసం ఎందుకు పెట్టడం లేదని నిలదీసినంత పనిచేశారు. ఇది ఓ రకంగా ఇతర వర్గాల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను పెంచింది. 

అదే సమయంలో హుజూరాబాద్‌లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతోనే దళిత బంధు పథకం పెట్టారనీ.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ పథకం ఊసే ఉండదని కూడా దళితులు బలంగా నమ్మారు. దీనికి బలం చేకూరేలా అకౌంట్లో పడిన డబ్బులు కూడా ఫ్రీజ్ చేయడం వంటివి జరిగాయి. దీంతో తమను పథకం పేరుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న నిర్ణయానికి వచ్చేశారు.