అంతరిక్ష వ్యాపారంలోకి దిగుతున్న భారతీయ కంపెనీలు

అమెరికాకు ధీటుగా అంతరిక్ష వ్యాపారంలోకి దిగడానికి భారతీయ ప్రైవేట్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి  వరకు ఈ వ్యాపారంలో తిరుగులేని మేటిగా కొనసాగుతున్న అమెరికన్ పారిశ్రామికవేత్త ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ కు ఈ రంగంలో సరికొత్త సవాల్ భారత్ నుండి ఎదురుకాబోతున్నది.

అంతరిక్ష వ్యాపారంలోకి దిగుతున్న భారతీయ ప్రైవేట్ కంపెనీలు.. స్పేస్‌ఎక్స్‌లో సగం ఖర్చుతో ఇస్రో సహకారంతో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఫ్లోటింగ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించే వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ద్రోణా వాయు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.

ఉపగ్రహ ప్రయోగం నుంచి కక్ష్య వరకు, డాటా ప్రాసెసింగ్, ఇతర సంబంధిత సౌకర్యాల వరకు భారతీయ కంపెనీలు చాలా సరసమైన ధరలకు సేవలను అందించగలవని ఇప్పటికే వెల్లడైంది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో నుంచి చవకైన శాటిలైట్ లాంచింగ్ ఏజెన్సీ టైటిల్‌ను ఎలోన్‌ మస్క్‌కు చెందిన కంపెనీ స్పేస్‌ఎక్స్‌ కొల్లగొట్టింది.

స్పేస్‌ఎక్స్ ప్రస్తుతం శాటిలైట్‌ ప్రయోగంలో కిలోకు 22,000 అమెరికన్‌ డాలర్లు వసూలు చేస్తున్నది. అయితే, భారతీయ కంపెనీలు కిలోకు 10 వేల అమెరికన్‌ డాలర్లకే ఆ పని చేయగలవని గతంలోనే నిరూపితమైంది.

 ప్రస్తుతం ప్రపంచంలో అంతరిక్ష వ్యాపారం 37.5 బిలియన్ డాలర్ల (రూ.2.8 లక్షల కోట్లు) కంటే ఎక్కువగా ఉన్నది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది. భారత ప్రభుత్వం ప్రైవేట్‌ రంగానికి తెరతీసిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష వ్యాపారానికి పెద్దపీట వేసేందుకు సిద్ధమవుతున్నట్లు  మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

 ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్‌లో 10 శాతమైనా భారతీయ కంపెనీలు కైవసం చేసుకుంటే అదే పెద్ద విజయమని నిపుణులు భావిస్తున్నారు. దాదాపు 350 స్పేస్‌ కంపెనీలతో భారతదేశం ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్నది. మన కంటే తక్కువ సంఖ్యలో స్పేస్‌ కంపెనీలు చైనా, జపాన్‌, రష్యాలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.