హోంమంత్రి హెచ్చరికతో మంగళసూత్ర ప్రకటన నిలిపివేత

ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ  చేసిన మంగళసూత్ర వాణిజ్య ప్రచార చిత్రాన్నిఉపసంహరించుకుంది. మంగళసూత్ర వాణిజ్య ప్రకటనను 24 గంటల్లోగా ఉపసంహరించుకోవాలని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా అల్టిమేటం జారీ చేశారు.  వాణిజ్య ప్రకటనను ఉపసంహరించుకోకుంటే పోలీసు బలగాలను పంపిస్తానని సాక్షాత్తూ హోంశాఖ మంత్రి బెదిరించడంతో ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దిగివచ్చారు. 
“ఇలాంటి ప్రకటనల గురించి నేను ముందే హెచ్చరించాను. డిజైనర్ సబ్యసాచి ముఖర్జీకి వ్యక్తిగతంగా 24 గంటల అల్టిమేటం ఇస్తూ హెచ్చరిస్తున్నాను. ఈ అభ్యంతరకర, అసభ్యకరమైన ప్రకటనను ఉపసంహరించుకోకపోతే, అతనిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. చర్య కోసం పోలీసు బలగాలను పంపుతాము” అని హోమ్ మంత్రి స్పష్టం చేశారు.

ఇలాంటి బాధాకరమైన సంఘటనలు కేవలం హిందూ చిహ్నాలతోనే ఎందుకు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖర్జీకి ధైర్యం ఉంటే వేరే మతంతో ఆ పని చేయాలి, అప్పుడు ఆయన నిజమైన ధైర్యవంతుడని అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. 


‘ఇంటిమేట్ ఫైన్ జ్యువెలరీ’ పేరుతో మంగళసూత్రాన్ని కలిగి ఉన్న సబ్యసాచి ముఖర్జీ కొత్త ఆభరణాల శ్రేణికి సంబంధించిన ప్రకటన. ఈ ప్రకటన అక్టోబర్ 27న విడుదలైంది. ప్రకటనలో, భిన్న లింగ,  స్వలింగ జంటలు ఒకే మంగళసూత్రాన్ని ధరించి కనిపించారు.
కొంత మంది ఒంటరిగా మంగళ సూత్రం ధరించగా, మరికొంత మంది అసభ్యకర రీతుల్లో మంగళ సూత్రం ధరించారు. ఫలితంగా నెటిజన్లు సబ్యసాచిని  ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.దీంతో సబ్యసాచి తన వాణిజ్య ప్రకటనను ఉపసంహరించుకున్నారు. 

యాడ్ క్యాంపెయిన్‌లో మహిళా మోడల్ ధరించి ఉన్న సన్నిహిత దుస్తులపై నెటిజన్లు నిరాశ చెందారు, అయితే మరొక విభాగం వినియోగదారులకు ప్రకటన దయనీయంగా ఉంది. కొందరు తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ సంస్కృతిపై దాడి చేశారని కొందరు పేర్కొన్నారు.
 
‘‘వారసత్వం, సంస్కృతిని డైనమిక్ సంభాషణగా మార్చే సందర్భంలో, మంగళసూత్ర ప్రచారం చేశాం. కాని ఈ ప్రచారం సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని మేం చాలా బాధపడ్డాం. సబ్యసాచి ప్రచార ప్రకటనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు’’ అని డిజైనర్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ కథనంలో రాసింది.
 
ఇలాంటి విమర్శలకు గురైనది సబ్యసాచి మాత్రమే కాదు. గత వారం, డాబర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కర్వా చౌత్ జరుపుకుంటున్న స్వలింగ జంటను కలిగి ఉన్న తమ ‘ఫెమ్’ ప్రకటనను ఉపసంహరించుకో వలసి వచ్చింది.