దేశంలో 20వేల మెగావాట్ల విద్యుత్‌ సంక్షోభం

దేశంలో బొగ్గు ఆధారిత ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతం అనగా.. దాదాపు 20వేల మెగావాట్ల విద్యుత్‌ సంక్షోభం ఏర్పడనుందని క్రిసిల్‌ అంచనా వేసింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా బొగ్గు డిమాండ్‌ తగ్గినప్పటికీ… విద్యుత్‌ ప్లాంట్లలో ఐదు రోజులకు సరిపడా బొగ్గునిల్వలు మాత్రమే ఉన్నాయని తెలిపింది.

వీటిలో సగానికి పైగా థర్మల్‌ ప్లాంట్లకు ఇంధన సరఫరా ఒప్పందాలు (ఎఫ్‌ఎస్‌ఎ) లేకపోవడంతో ఈ కొరతను పూడ్చుకునేందుకు దిగుమతులు లేదా ఇ-వేలం ద్వారా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని క్రిసిల్‌ చెబుతోంది. బొగ్గు కొరత, అధిక ధరల కారణంగా.. నిర్వహణ వ్యయం భారంగా మారడంతో ఈ ధర్మల్‌ ప్లాంట్లు కొన్ని రోజుల పాటు మూతపడాల్సి రావచ్చని భావిస్తున్నారు.

ఆదాయం కన్నా నిర్వహణ వ్యయం అధికంగా ఉన్నందున ఈ పరిస్థితి ఏర్పడనుందని తెలిపింది. శిలాజ బొగ్గు దిగుమతులను పక్కనపెడితే.. రెండవ త్రైమాసికంలో దేశీయబొగ్గు సరఫరా ..గత ఏడాది ఇదే ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16 శాతం పెరిగినప్పటికీ.బొగ్గు దిగుమతులు 20 శాతానికి పైగా పడిపోయాయి. దీని ఫలితంగా మొత్తం బొగ్గు సరఫరా సుమారు 8 శాతం పెరిగినప్పటికీ.. ప్లాంట్ల పరంగా చూస్తే బొగ్గు నిల్వలు క్షీణించాయి. అంతేకాకుండా, మైనింగ్‌పై ప్రభావితం చూపుతున్న వర్షాల కారణంగా బొగ్గు సరఫరా అస్తవ్యస్తంగా ఉందని క్రిసిల్‌ తెలిపింది.

అధిక అంతర్జాతీయ బొగ్గు ధరలు రాబోయే కొద్ది నెలల్లో దిగుమతులను ప్రియం చేస్తాయని, దేశీయ ఇ- వేలం ప్రిమియంలు పెరుగుతాయని క్రిసిల్‌ రేటింగ్‌ డైరెక్టర్‌ అంకిత్‌ హకు పేర్కొన్నారు. దీంతో 20 గిగా వాట్స్‌ ప్రైవేటు సామర్థ్యాలు అత్యంత హాని కలిగిస్తాయని, బహిరంగ మార్కెట్‌ పై ,బొగ్గు దిగుమతులపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.

ఇప్పుడు పెరిగిన ధరలతో ఈ విద్యుత్‌ సంస్థలు కార్యకాలపాలు కొనసాగిస్తే.. నష్టాలకు దారితీయవచ్చునని, అందువల్ల బొగ్గు ధరలు తగ్గేంత వరకు సంస్థలను మూసివేసేందుకు సిద్ధపడవచ్చని అంచనా వేశారు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 133 గిగావాట్ల సామర్ద్యం కలిగిన జెన్‌కోలలో ఈ సమస్యలు రావు. ఇవన్నీ వాటి మొత్తం అవసరాలను బొగ్గు సరఫరా ఒప్పందాలను కలిగి ఉన్నాయి. వాటి ద్వారా నోటిఫైడ్‌ ధరలకు బొగ్గు సరఫరాను పొందుతాయి.

మిగిలిన 56 గిగావాట్లను అందించే ప్రైవేట్‌ జెనెకోలు కూడా సగానికి పైగా బొగ్గు సరఫరా ఒప్పందాలు కలిగి ఉన్నాయి. మిగిలిన 20 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు బొగ్గు సంక్షోభం కారణంగా మూతపడనున్నాయి. దీంతో దేశంలో విద్యుత్‌ లభ్యత సమస్య ఏర్పడవచ్చు. ఫలితంగా దేశవ్యాప్తంగా విద్యుత్‌ కోతలు విధించే అవకాశం కనిపిస్తున్నది.