పెళ్ళిలో మ్యూజిక్ ఆపడం కోసం తాలిబన్లు 13 మంది ఊచకోత

ఒక పెళ్ళి వేడుకలో మ్యూజిక్ తో సందడి చేసుకోవడం చూసి నచ్చక వారిని కట్టడి చేయడం కోసం ఏకంగా 13 మందిని ఊచకోతకు గురిచేయడం తాలిబన్ల రాక్షస కృత్యాన్ని మరోమారు వెల్లడి చేసింది. కొన్ని రోజుల క్రితం ఓ మహిళా క్రీడాకారిణి తల నరికిన ఘటన గురించి మరవక ముందే తాజాగా తాలిబన్లు ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. 

అఫ్గన్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సలేహ్‌ ట్విటర్‌ వేదికగా ఈ అకృత్యాన్ని  వెల్లడించారు. అమ్రుల్లా చెప్పిన దాని ప్రకారం నంగర్‌హార్ ప్రావిన్స్‌ ప్రాంతంలో ఓ చోట వివాహం జరుగుతుంది. ఆ వివాహ వేడుక వద్ద మ్యూజిక్‌ ఏర్పాటు చేశారు. అది తాలిబన్లకు నచ్చలేదు. మ్యూజిక్‌ ఆపమని చెప్పడానికి వారు అక్కడున్న జనాల్లో ఓ 13 మందిని ఊచకోత కోశారు. 

 ‘‘తాలిబన్‌ మిలిటెంట్లు నంగర్‌హార్ ప్రావిన్స్‌ ప్రాంతంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో సంగీతాన్ని ఆపడం కోసం 13 మందిని ఊచకోత కోశారు. మనం కేవలం ఖండించడం ద్వారా మాత్రమే ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేం” అంటూ అమరుల్లా ట్వీట్ చేశారు. 

“మన సంస్కృతిని చంపేయడం కోసం పాకిస్తాన్‌ వీరికి దాదాపు 25 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చింది. మన సంస్కృతి స్థానంలో ఐఎస్‌ఐ కల్చర్‌ని తీసుకువచ్చి.. మన ఆత్మలను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రాక్షస పాలన ఎంతో కాలం కొనసాగదు. కానీ ఉన్నన్ని రోజులు అఫ్గన్లు మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అంటూ అమరుల్లా అందులో పేర్కొన్నారు. 

అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న నాటి నుంచి తాలిబన్లు దేశంలో కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. ఓవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దేశంలో మాంద్యం పెరిగితోంది. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా.. చాంధస పాలన కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో మ్యూజిక్‌, టీవీల్లో ఆడవారి గొంతు వినిపించకూడదంటూ నిషేధం విధించారు. అఫ్గనిస్తాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ కాలేజీని కూడా మూసేశారు.